
నూతన సాంకేతికతతో సాగు
అనపర్తి : వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకుని పంటల్లో నాణ్యమైన దిగుబడి పొందాలని తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు అన్నారు. బుధవారం మండలంలోని పులగుర్త గ్రామంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలో సార్వా వరి పంట నాట్లు పూర్తయ్యాయని పంట ఆరోగ్యంగానే ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు మాట్లాడుతూ సార్వాలో చీడపీడలు తక్కువగా ఉన్నాయన్నారు. కాండం తొలిచే పురుగు అక్కడక్కడా కనిపిస్తోందని, దాని నివారణకు నారుమడిలో మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. తొందరపడి పురుగు మందులు వాడరాదని పురుగులు, తెగుళ్లు ఉనికి గమనించాకే సస్యరక్షణ మందులు వాడాలన్నారు. కొత్త మినీకిట్ రకాలు సాగు చేసుకుని పరీక్ష చేసుకోవాలని, శాస్త్రవేత్తల సలహాలు పాటించాలని సూచించారు. జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ ఎస్.జయరామలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి సురేష్, వీఏఏ రాకేష్, రైతులు జాస్తి రామచంద్రరావు, గొడితి వెంకటకృష్ణ, బలుసు నాగేశ్వరరావు పాల్గొన్నారు.