
వాడపల్లి క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. క్యూలైన్లు పెంచడంతో పాటు ప్రవేశ ద్వారాల వద్ద వెడల్పాటి మార్గాలను ఏర్పాటు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న లడ్డూ కౌంటర్లకు అదనంగా మరికొన్ని కౌంటర్లు పెంచనున్నామన్నారు. వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచనున్నామన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను తహశీల్దార్ రాజేశ్వరరావు, డీసీ చక్రధరరావు బుధవారం పరిశీలించారు.
అన్న ప్రసాద భవనానికి రూ.50 వేల విరాళం
వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఆకివీడుకు చెందిన కొల్లి వెంకటేశ్వరబాబు, వెంకటలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.50 వేలు విరాళంగా సమర్పించారు. దాతలకు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందించారు.
దరఖాస్తుల ఆహ్వానం
వాడపల్లి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం దేవస్థానం ద్వారా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఈ శిబిరంలో సేవ చేయడానికి నర్సింగ్ క్వాలిఫైడ్ అయిన మహిళలు / పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలిపారు. ఆసక్తి గల వారు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.