
స్వామి పుష్కరిణిలో డేవిల్ ఫిష్!
యథేచ్ఛగా చేపల వేట
అసలు అవి ఎలా వచ్చాయి?
ఇద్దరు మృతితో ఎట్టకేలకు నీటికి మోక్షం
గండేపల్లి: తాళ్లూరు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి గజేంద్ర మోక్ష పుష్కరిణిలో కొందరు ఆకతాయిలు సోమవారం చేపలను వల సహాయంతో పట్టుకుని తీసుకుపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ పుష్కరిణిలో పెరిగిన చేపలను పట్టుకోవడం శాస్త్ర సమ్మతం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆలయాలలో ఉండే కోనేరులలో పెరిగిన చేపలను విష్టుమూర్తి మత్స్యావతారంగా భక్తులు భావిస్తారు. అంతటి పవిత్రమైన పుష్కరిణిలో చేపలను పట్టుకోవడం ఏమిటని భక్తులు మండిపడుతున్నారు.
అసలు పుష్కరిణిలోకి చేపలు ఎలా వచ్చాయి?
గజేంద్ర మోక్ష పుష్కరిణిలోకి చేపలు ఎలా వచ్చాయి? ప్రకృతి సహజసిద్ధమా! ఎవరైనా చేప పిల్లలను కోనేరులో వేశారా అన్నది భక్తులను వేధిస్తున్న ప్రశ్న. గతంలో కొందరు కోనేరులో చేప పిల్లలను పెంపకానికి వేయడంతో అడ్డుకున్నామని అర్చకులు చెబుతున్నారు. అప్పట్లో వేసిన చేపల పెట్టిన గుడ్లే ప్రస్తుతం కోనేరులో చేపలు పెరగడానికి కారణం కావచ్చు అంటున్నారు.
ఘోరం జరిగే వరకూ మనసు కరగదా
ఘోరాలు జరిగితేనే అధికారులు స్పందిస్తారని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాణాలు పోయే వరకూ స్పందించారా? అని ప్రశ్నిస్తున్నారు. పుష్కరిణికి మెట్ల మార్గం నాచుకట్టి కనీసం భద్రత లేకపోవడంతో ఇటీవల బొర్రంపాలెంకు చెందిన తండ్రీ కొడుకు స్నానాకికి దిగి మృతిచెందారు. దీంతో రెవెన్యూ, దేవదాయశాఖ, అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టేందుకు తగు సూచనలతో ప్రణాళికను సిద్ధం చేశారు.
పుష్కరిణిలో నీటికి మోక్షం
ఎట్టకేలకు పుష్కరిణిలో నీటికి మోక్షం కలిగింది. ఇటీవల జరిగిన ప్రమాదంతో ఇది సాధ్యమైంది. కొన్ని సంవత్సరాలుగా పుష్కరిణిలో నీరు నిల్వ ఉండి నాచుకట్టి తట్టు తేలి పుష్కరిణి (కోనేరు) ప్రమాదకరంగా మారింది. పదవులు లేకపోయినా కొందరు పెత్తనం చెలాయించడం వల్ల ఆలయ అభివృద్ధికి ఆటకం కలుగుతోందని గ్రామస్తులు, భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నారు.
పుష్కరిణిలో డేవిల్ ఫిష్
పుష్కరిణిలో సాధారణ చేపలతో పాటు డేవిల్ ఫిష్‌లు పెరిగాయి. పుష్కరిణిలో నీరు తగ్గుముఖం పట్టడంతో చేపల వేటకు దిగిన వారి వలకు ఈ డేవిల్ ఫిష్‌లు చిక్కాయి. అటుగా వెళ్లే వారందూ వాటిని చూసేందుకు ఎగబడి ఫొటోలు తీసుకున్నారు. ఈ డేవిల్ ఫిష్, ఇతర జాతులకు చెందిన చేపలు పుష్కరిణి అడుగుబాగం బురదలో తేలియాడుతున్నాయి.

స్వామి పుష్కరిణిలో డేవిల్ ఫిష్!

స్వామి పుష్కరిణిలో డేవిల్ ఫిష్!