అన్నదాతల సమరభేరి | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల సమరభేరి

May 25 2025 8:00 AM | Updated on May 25 2025 8:00 AM

అన్నద

అన్నదాతల సమరభేరి

● మాకు లేదా.. ప్రాధాన్యం?

ఇదిగో అదిగో అంటున్నారు

ఏప్రిల్‌ 29న మూడెకరాల పంటకు చెందిన ధాన్యం అమ్మాను. నేటికీ సొమ్ములు పడలేదు. అధికారులను అడుగుతూంటే ఇదిగో వస్తాయి, అదిగో వస్తాయని అంటున్నారే తప్ప సొమ్ము రాలేదు. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేసేది?

– నిచెనకోళ్ల కృష్ణమూర్తి, వరి రైతు, కోరుపల్లి

కాళ్లరిగేలా తిరిగినా..

ధాన్యం టార్గెట్‌ అయిపోయిందన్నారు. ఆందోళన చేస్తే ధాన్యం తీసుకున్నారు. కానీ నెల రోజులైనా సొమ్ము మాత్రం వేయలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. చివరకు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నాం.

– తుమ్మలపల్లి సత్యనారాయణ, రైతు, కానూరు

డబ్బు రావడం లేదు

ధాన్యం నేటికీ రాశుల్లోనే ఉంది. అనుమతులు రాలేదంటున్నారు. పోనీ, అమ్మిన ధాన్యానికి సొమ్ము వస్తే అప్పులు తీరుద్దామంటే ఆ డబ్బులు రావడం లేదు. అధికారుల చుట్టూ తిరగలేకపోతున్నాం. వ్యవసాయం చేసేకన్నా అడుక్కుంటే మంచిదిలా ఉంది.

– కేతా శ్రీనివాస్‌, వరి రైతు, ముక్కామల

ధాన్యం సొమ్ము చెల్లించని కూటమి సర్కార్‌

రూ.143.4 కోట్ల మేర బకాయి

నెల రోజులుగా రైతుల ఎదురు చూపులు

ఆగ్రహంతో రోడ్డెక్కిన అన్నదాతలు

ఎలా బతకాలని ఆవేదన

కానూరు, డి.ముప్పవరంలో ఆందోళనలు

పెరవలి: అప్పులు తెచ్చారు.. పెట్టుబడులు పెట్టారు.. కౌలు చెల్లించారు.. ఎరువులు, పురుగు మందులు జల్లారు.. ప్రకృతి విపత్తులకు ఎదురీదారు.. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్నారు.. చివరకు పసిడి గింజలు పండించారు.. తీరా చూస్తే కొనుగోళ్ల సమయంలో టార్గెట్ల పేరుతో మోసం.. పండించిన లక్షల టన్నుల ధాన్యం గింజలు ఏం చేసుకోవాలో తెలియక ఆక్రోశం.. దళారుల దగా.. ఆందోళనకు దిగితే ముష్టి విదిల్చినట్లు కొనుగోలు టార్గెట్‌ మరో లక్ష టన్నుల పెంపు.. సరేననుకుంటే కొన్న ధాన్యానికి నెల రోజులుగా నయాపైసా కూడా చెల్లించడం లేదు.. ఇటువంటి వేదనాభరితమైన పరిస్థితుల్లో అన్నదాతలకు కడుపు మండింది.. పండించిన ప్రతి ధాన్యం గింజా రైతుల నుంచి కొనుగోలు చేస్తామని, ఇది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పడమే తప్ప.. కూటమి సర్కారు తమకు ఒరగబెట్టిందేమీ లేదని కన్నెర్రజేశారు. తమపై ఈ చిన్నచూపు ఏమిటని, కొన్న ధాన్యానికి డబ్బులెప్పుడిస్తారని ప్రశ్నిస్తూ పోరుబాట పట్టారు. పెరవలి మండలం కానూరు, నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామాల్లో రహదారులు దిగ్బంధించారు.

కొనుగోలు నుంచే దగా

జిల్లావ్యాప్తంగా రైతులు రబీలో 58,586 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. మొత్తం 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ, అనూహ్యంగా ప్రభుత్వం 2.50 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని మొదట లక్ష్యంగా నిర్ణయించింది. ఈ లక్ష్యం పూర్తయిపోయిందంటూ ప్రభుత్వ యంత్రాంగం కొనుగోళ్లు నిలిపివేయడం.. ధాన్యం తీసుకోవడానికి మిల్లర్లు నిరాకరించడం.. అదే సమయంలో అకాల వర్షాలు కురవడంతో.. మిగిలిన ధాన్యం ఏం చేయాలో, ఎలా కాపాడుకోవాలో అర్థం కాక పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. తమ వద్ద ఉన్న ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ కొవ్వూరు, పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు తదితర మండలాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు. దీంతో, దిగివచ్చిన ప్రభుత్వం ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచింది. ఇంత అస్తవ్యస్త విధానాలతో ధాన్యం కొనుగోలు చేసిన సర్కారు.. నెల రోజులు గడుస్తున్నా నేటికీ సొమ్ము జమ చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు.

ఇంత మోసమా?

ఈ నెల 22వ తేదీ వరకూ 3.37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. మరో 13 వేల మెట్రిక్‌ టన్నులు సేకరిస్తే లక్ష్యం పూర్తవుతుంది. ఇప్పటి వరకూ సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.776 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇందులో రూ.632.6 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. అది కూడా ఈ నెల 7వ తేదీ వరకూ మాత్రమే చెల్లించారు. మరో రూ.143.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెరవలి మండలంలో రూ.4.39 కోట్లు, కానూరు రైతులకు రూ.1.39 కోట్లు, నిడదవోలు మండలంలో 605 మంది రైతులకు రూ.8.22 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇదే విధంగా దాదాపు ప్రతి మండలంలోనూ రూ.5 నుంచి 10 కోట్ల వరకూ రైతులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. అదనంగా సేకరించిన లక్ష టన్నుల ధాన్యానికి సొమ్ము చెల్లించకుండా ప్రభుత్వం తమను మోసం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. కొంతమందికి ఏప్రిల్‌లో సేకరించిన ధాన్యానికి సైతం ఇప్పటి వరకూ డబ్బులు జమ చేయలేదని, ఇలాగైతే తాము ఏవిధంగా బతకాలని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పెద్ద రైతులకు సొమ్ము జమ చేసి, కౌలు, సన్న, చిన్నకారు రైతులకు ఇవ్వడం లేదని, దీంతో తాము ఆర్థికంగా నలిగిపోతున్నామని వాపోతున్నారు. ఈ డబ్బులు రాకపోతే పంటకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని, కౌలు ఎలా చెల్లించాలని, ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల గోడు ఆలకించరా..!

నిడదవోలు రూరల్‌: రబీలో పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడంతో పాటు నెల రోజులుగా నుంచి పెండింగ్‌ పెట్టిన డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు శనివారం ధర్నా నిర్వహించారు. నిడదవోలు మండల పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో (ఆర్‌ఎస్‌కే) ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని జీడిగుంట, పందలపర్రు, కోరుపల్లి, పెండ్యాల, మునిపల్లి, కలవచర్ల గ్రామాలకు చెందిన రైతులు డి.ముప్పవరం ప్రధాన సెంటర్‌లో నిరసన తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి తీవ్రంగా నష్టపోయామన్నారు. రైతులు ఉప్పల శ్రీనివాస్‌, జల్లేపల్లి వీరరాఘవులు మాట్లాడుతూ, రబీ ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. నిడదవోలు మండలంలోని ఆయా ఆర్‌ఎస్‌కేల ద్వారా రబీలో 8,600 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతి గింజా కొంటామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంటనే వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నెల రోజుల నుంచి మిల్లులకు ధాన్యం తోలిన 605 మంది రైతులకు రూ.8.22 కోట్లు చెల్లించాలని, డబ్బులు ఎప్పుడు పడతాయో సంబంధిత అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని రైతులు నినదించారు. వ్యవసాయ శాఖ కొవ్వూరు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, ఏఎస్‌ఓ నాగాంజనేయులు, మండల వ్యవసాయాధికారి జి.సత్యనారాయణ, ఎస్సై కె.వీరబాబు అక్కడకు చేరుకుని, రైతులతో చర్చించారు. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కార్యక్రమంలో రైతులు నిచ్చెనకోళ్ల కృష్ణమూర్తి, కామన కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతల సమరభేరి1
1/6

అన్నదాతల సమరభేరి

అన్నదాతల సమరభేరి2
2/6

అన్నదాతల సమరభేరి

అన్నదాతల సమరభేరి3
3/6

అన్నదాతల సమరభేరి

అన్నదాతల సమరభేరి4
4/6

అన్నదాతల సమరభేరి

అన్నదాతల సమరభేరి5
5/6

అన్నదాతల సమరభేరి

అన్నదాతల సమరభేరి6
6/6

అన్నదాతల సమరభేరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement