
స్మార్త పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు
రాజమహేంద్రవరం సిటీ: కోటిలింగాలపేటలోని పందిరి మహదేవుడు కోటిలింగాల సత్రంలో నిర్వహిస్తున్న స్మార్త పాఠశాలలో ప్రవేశానికి బ్రాహ్మణ బాలుర నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పందిరి మహదేవుడు సత్రం సహాయ కమిషనర్ పి.విశ్వనాథరాజు శనివారం ఈ విషయం తెలిపారు. ఆరేళ్ల కృష్ణ యజుర్వేద స్మార్త విద్యను అభ్యసించేందుకు తొమ్మిదేళ్ల నుంచి 14 ఏళ్లలోపు ఉపనయనం జరిగిన బాలురు అర్హులన్నారు. వారికి ఉచిత వసతి, భోజనం, వైద్య సదుపాయం ఉంటుందని, నెలకు రూ.2 వేల వంతున ఉపకార వేతనం అందిస్తామన్నారు. దరఖాస్తులను సత్రం కార్యాలయంలో జూన్ 9వ తేదీ వరకు పొందవచ్చన్నారు. జూన్ 11 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశానికి మౌఖిక పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ దరఖాస్తులుపంపించాలని కోరారు.
కోవిడ్ నిబంధనలు పాటించండి
రాజానగరం: యూనివర్సిటీ, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లతో పాటు అనుబంధ కళాశాలల్లో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఆదేశించారు. ప్రిన్సిపాల్స్, డీన్స్‌తో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నందున అప్రమత్తత ఎంతో అవసరమన్నారు. గతంలో మాదిరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, శానిటైజర్లతో చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ
విభాగాల్లో నియామకాలు
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి నల్లమిల్లి కాంతమ్మ (అనపర్తి), ఆచంట అనసూయ (గోపాలపురం), బూత్ కమిటీ వింగ్స్ కార్యదర్శిగా బొడ్డు ముత్యాలరావు (అనపర్తి), జాయింట్ సెక్రటరీగా కళ్యాణం రాంబాబు (రాజానగరం), ఇంటలెక్చువల్ ఫోరం కార్యదర్శిగా పెండ్యాల వీర రాఘవులు (గోపాలపురం), ఒండ్రు సత్యనారాయణ (అనపర్తి), ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ జాయింట్ సెక్రటరీగా కె.సర్రాజు (రాజానగరం), పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా మండా రాజారెడ్డి (అనపర్తి), తాడి హరిచంద్ర ప్రసాద్‌రెడ్డి (రాజానగరం) నియమితులయ్యారు.
ఉపాధ్యాయ బదిలీ
దరఖాస్తుల గడువు పెంపు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్లు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించే గడువును మరో రోజుకు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శనివారం రాత్రి తెలిపారు. ఆ ప్రకారం ఆదివారం రాత్రి 11.45 గంటల వరకూ అవకాశం ఉందన్నారు. డివిజన్ ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ఉపాధ్యాయులకు ఈ సమాచారాన్ని అందజేయాలన్నారు.
స్వామిని చూసి.. మది మురిసి
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3.49,554 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామి వారిని 5,500 మంది స్వామి దర్శించుకోగా, నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.93,351 ఆదాయం వచ్చిందని తెలిపారు.
5 నుంచి బాలాజీ కల్యాణోత్సవాలు
అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి తిరు కల్యాణోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. జూన్ 9 వరకూ ఈ కల్యాణోత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 6వ తేదీ రాత్రి 9.15 గంటలకు స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం 11.31 గంటలకు స్వామివారి కల్యాణోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు.