
అనాథ బాలలకు ‘ఆధార్’ ఇవ్వండి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అనాథ బాలబాలికలను కనుగొని, వారికి ఆధార్ కార్డు ఇవ్వాలని, చదువు లేని వారికి విద్యావకాశం కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ఇన్‌చార్జి సెక్రటరీ షేక్ జానీ బాషా సూచించారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో ‘సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సెస్ టు ట్రాకింగ్ అండ్ హోలిస్టిక్ ఇన్‌క్లూజన్ ఆన్ 13 మే 2025’ సాథీ కమిటీ సర్వే సభ్యులకు శనివారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యంగా లేని బాలబాలికలకు వైద్య సేవలు, ఉచిత న్యాయ సలహాలు అందించడంపై సభ్యులంతా పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సాథీ కమిటీ సర్వే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 26 వరకూ నిర్వహించాలన్నారు. వీధుల్లో, వసతి గృహాల్లో ఉన్న 18 సంవత్సరాల లోపు అనాథ బాలికలను గుర్తించి, ఆధార్ కార్డు కల్పించడమే సాథి సర్వే ముఖ్యోద్దేశమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి.జగదీష్‌కుమార్, మండలాల తహసీల్దార్లు, విద్య, ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖాధికారులు, బాలల సంరక్షణాధికారులు, ప్యానల్ లాయర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.