
మహిళల రక్షణే మొదటి ప్రాధాన్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలికలు, మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. మహిళలు, బాలికల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా పోలీసు అధికారులు, శక్తి టీములతో జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మహిళా మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్ ఇన్‌స్టాల్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా 24 గంటలూ పోలీసు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లావ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, గుర్తించిన హాట్‌స్పాట్ల వద్ద శక్తి టీముల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో వుమెన్ హెల్ప్ డెస్క్, మహిళల ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, ఎల్.అర్జున్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ బి.రామకృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీనివాసరావు, జోనల్ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.