
విద్యుదాఘాతానికి తాపీమేస్త్రి మృతి
జగ్గంపేట: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందినట్లు జగ్గంపేట ఎస్సై రఘునందనరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. జగ్గంపేట గ్రామానికి చెందిన సుంకరరాజు (35) తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతను స్థానిక బాలాజీ నగర్‌లో ఓ ఇంట్లో తాపీపని చేస్తున్నాడు. శనివారం యథావిధిగా ఉదయం పనిలోకి వచ్చిన రాజు శ్లాబ్ వేసే నిమిత్తం కర్రలు కోస్తుండగా కర్రలు కోసే మెషీన్ వైర్లు ప్రమాదవశాత్తు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మహిళకు గాయాలు
పిఠాపురం: గొల్లప్రోలు 216 జాతీయ రహదారిపై టోల్‌గేట్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, ఒక మహిళకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. కత్తిపూడి నుంచి పిఠాపురం వైపు వెళుతున్న పాల ట్యాంకర్ గొల్లప్రోలు టోల్‌గేట్ దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ వేయడంతో దాని వెనుక వస్తున్న ఆటో అదుపుతప్పి లారీని ఢీకొంది. ఆటోలో ఉన్న డ్రైవరు గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన మేడిద ధర్మేంద్ర వరప్రసాద్ (34), అదే గ్రామానికి చెందిన బి.లోవకుమారిలకు గాయాలయ్యాయి. ఇందులో వరప్రసాద్ మృతి చెందగా, లోవకుమారి చికిత్స పొందుతోంది. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి దుర్మరణం
రాజోలు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఏఎస్సై కె.నరసింహారావు కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి పొదలాడకు చెందిన బత్తుల వంశీకృష్ణరాజు (19) పాల ప్యాకెట్ కోసం మోటార్ సైకిల్‌పై ఆ గ్రామంలో సెంటర్‌కు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. తాటిపాక నుంచి మోటార్ సైకిల్‌పై రాజోలు వస్తున్న కొప్పాడి రాజీవ్, మొగలి గణేష్‌లు ఢీకొట్టారు. దీంతో వంశీకృష్ణరాజు తలకు తీవ్రగాయం కావడంతో వైద్యం నిమిత్తం అమలాపురం కిమ్స్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వంశీకృష్ణ విజయవాడలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుమారుడి మృతితో తండ్రి బత్తుల దొరరాజు కన్నీరు మున్నీరుగా విలపించారు. దొరరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు.

విద్యుదాఘాతానికి తాపీమేస్త్రి మృతి