
సంక్షేమ హాస్టళ్లలో వసతులకు ప్రాధాన్యం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సంక్షేమ వసతి గృహాల్లో అన్ని మౌలిక సౌకర్యాలూ కల్పించాలని, పాఠశాలలు ప్రారంభించే నాటికి ఆయా పనులు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. జిల్లా సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతుల కల్పనపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బడి బయటి పిల్లలను గుర్తించి, తిరిగి పాఠశాలలకు వచ్చేలా, వసతి గృహాల్లో సీట్లు కేటాయించాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి, హాస్టళ్లలో చేర్పించాలని చెప్పారు. విడాకులు తీసుకున్న, విదేశాలకు వెళ్లిన మహిళల పిల్లలు, అసురక్షిత వాతావరణంలో ఉన్న ఆడ పిల్లలను గుర్తించి హాస్టళ్లలో చేర్పించాలన్నారు. తక్కువ మంది పిల్లలున్న వసతి గృహాలను గుర్తించి, హేతుబద్ధీకరించాలని సూచించారు. అన్ని వసతి గృహాల్లో టీవీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు.