
ఎమ్మెల్యే అశోక్ ఫొటోతో ఫేక్ అకౌంట్
మోసాలు చేస్తున్న నిందితుడి అరెస్ట్
యానాం: యానాం నియోజకవర్గ శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్‌అశోక్ ఫొటోతో ఫేక్ అకౌంట్‌తో షాది డాట్‌కమ్‌ను ప్రారంభించి పలువురిని మోసం చేస్తున్న ఘటనకు సంబంధించి నిందితుడు చెరుకూరి వంశీ అనే యువకుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఫొటోతో ఎవరో షాది డాట్‌కమ్ ఫేక్ అకౌంట్ ప్రారంభించి మోసాలు చేస్తున్నారని, ఇదివరలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు వంశీ ఆచూకీ కోసం గాలించారు. అయితే అతనిపై గత 8 ఏళ్లలో హైదరాబాద్, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో పలు కేసులు నమోదుకాగా నాలుగేళ్ల వరకు జైలుశిక్ష సైతం పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అశోక్ ఫొటోతో ఫేక్ అకౌంట్ మొదలుపెట్టినట్లు గుర్తించారు. నిందితుడు హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుసుకున్న యానాం పోలీసులు అతనిని యానాం తీసుకువచ్చి విచారించారు. అయితే హైదరాబాద్‌లో కూడా అతనిపై పలు కేసులు ఉండటంతో తిరిగి అక్కడకు పోలీసులు తరలించగా రిమాండ్ విధించడంతో జైలుకు పంపినట్లు తెలిసింది.