
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల కేంద్రం సుబ్బారాయుడు గుడి వద్ద శుక్రవారం ఉదయం పల్లం నుంచి కాకినాడ వెళ్లే ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్‌ను ఢీ కొట్టడంతో సాగిరాజు శ్రీనివాస నరసింహరాజు (49) మృతి చెందారు. కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపిన సమాచారం ప్రకారం అమలాపురం డిపో ఆర్టీసీ బస్సు పల్లం నుంచి కాకినాడ వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను ఢీ కొట్టింది. నరసింహరాజును స్థానికులు 108 అంబులెన్సులో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయినవిల్లి మండలం పోతుకుర్రుకు చెందిన సాగిరాజు శ్రీనివాస నరసింహరాజు కోనపాకపేట ఆనంద హేచరీలో పని చేస్తున్నాడు. అక్కడకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలు యూకేలో ఉన్నారు. యూకేలో కుమార్తె ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు ఎంఎస్ చదువుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కె.గంగవరం: మండలంలోని అముజూరుకి చెందిన పాలపర్తి శేషగిరిరావు(60) కాకినాడలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. శేషగిరిరావు రామచంద్రపురం నుంచి స్వగ్రామం అముజూరు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో స్థానికులు అతడిని పామర్రు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కె.గంగవరం ఎస్సై జానీ బాషా శుక్రవారం విలేకరులకు తెలిపారు.