
ఖైదీలకు ఈ– ములాఖత్
జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్
కంబాల చెరువు (రాజమహేంద్రవరం): జైళ్ల శాఖలో చేపట్టనున్న సంస్కరణలలో భాగంగా రాష్ట్రంలో ఉన్న జైళ్లలో కృత్రిమ మేధ ఉపయోగించి సిబ్బందిపై ఉన్న ప్రస్తుత పనిభారాన్ని తగ్గించనున్నామని జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఖైదీల బ్యారక్‌లు, ఆరుబయలు జైలు, జైలు ఆవరణలోని వ్యవసాయ క్షేత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కారాగారంలో పనిచేస్తున్న గార్డెనింగ్ సిబ్బందితో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకుని సూచనలు చేశారు. ‘కృత్తిమ మేధ’’ ద్వారా గార్డెనింగ్ సిబ్బంది పై ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించి పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఖైదీలు ఈ – ములాఖత్ ద్వారా కారాగారం నుంచి కుటుంబ సభ్యులతో, బంధువులతో నేరుగా వీడియో కాల్ ద్వారా మాట్లాడేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్, మునిసిపల్ కమిషనరు కేతన్‌కార్గే ఆయనను కలిశారు. ఆయన వెంట జైళ్ళ శాఖ కోస్తా ప్రాంత ఉపశాఖాధికారి రవి కిరణ్, జైలు సూపరింటెండెంట్ రాహుల్, జైలు అధికారులు ఉన్నారు.
సచివాలయాల్లో
మరో ఆరు సేవలు
కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో నూతన రైస్ కార్డుల నమోదుతో పాటు రైస్ కార్డులకు సంబంధించి మరో ఆరు సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుధవారం నుంచి ప్రారంభించినట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నూతన రైస్ కార్డుల కోసం ఇప్పటి వరకూ అందిన దరఖాస్తులను, కొత్తగా పెట్టుకునే దరఖాస్తులను సచివాలయాల్లో ఏపీ సేవా ప్లాట్ ఫారమ్ ద్వారా నమోదు చేసేందుకు మండల, సచివాలయ సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. నూతన రైస్‌కార్డుల నమోదుతో బాటు రైస్ కార్డుల విభజన, రైస్ కార్డులలో సభ్యులను చేర్చడం, సభ్యుల తొలగింపు, రైస్ కార్డు సరెండర్ చేయడం, కార్డులో చిరునామా మార్పు, తప్పుగా నమోదైన రైస్ కార్డు ఆధార్ సీడింగ్ సవరణ సేవల కోసం కూడా ప్రజలు సచివాలయాలను సంప్రదించవచ్చన్నారు.
ఉద్యోగులను మోసం చేసిన చంద్రబాబు
ప్రత్తిపాడు: పరిపాలనానుభవం అపారంగా ఉందని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలనే కాక ఉద్యోగులను సైతం మోసం చేశారని వైఎస్సార్ సీపీ పెన్షనర్ల వింగ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలకమర్తి సాయి ప్రసాద్ విమర్శించారు. ప్రత్తిపాడులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కోసం మూడు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అనేక హామీలిచ్చిన కూటమి నేతలు గద్దెనెక్కిన తర్వాత హామీలన్నీ గాలికి వదిలేశారన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం రూ. 30 వేల కోట్లు బకాయిలు ఉండగా కేవలం రూ.7,300 కోట్లు విడుదల చేసిందన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఐఆర్ 30 శాతం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.