
తహసీల్దార్ ఆఫీస్ వద్ద గుండెపోటుతో రైతు మృతి
మృతదేహంతో గ్రామస్తుల ఆందోళన
దేవరపల్లి: స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గుండెపోటుతో రైతు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి ఉద్రిక్తతకు దారి తీసింది. మృతుడు దెయ్యాల వెంకట్రావు (44) కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన వెంకట్రావు భార్య రత్నకుమారి, ఆమె అన్నదమ్ములకు 60 సెంట్ల భూమి ఉంది. దీనిని గ్రామ సర్వేయర్ దుర్గారావు అదే గ్రామానికి చెందిన పోలుమాటి రమేష్ పేరున ఆన్‌లైన్ చేశారు. దీనిని తమ పేరిట మార్చాలని 20 రోజులుగా వెంకట్రావు దంపతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకట్రావుకు సర్వేయర్ బుధవారం సాయంత్రం ఫోన్ చేసి, తహసీల్దార్ కార్యాలయానికి రావాలని చెప్పారు. దీంతో భార్య రత్నకుమారితో కలసి వెంకట్రావు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మండల సర్వేయర్ దిల్లేశ్వరరావు, గ్రామ సర్వేయర్ దుర్గారావు, రైతు వెంకట్రావుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వెంకట్రావు గుండెపోటుతో అక్కిడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే వెంకట్రావు మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో, ఆగ్రహించిన వెంకట్రావు కుటుంబ సభ్యులు, బంధువులు అతడి మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. గ్రామ సర్వేయర్, మండల సర్వేయర్ వాగ్వాదానికి దిగడం వల్లే తన భర్త గుండెపోటుతో మృతి చెందారని, తన కుటుంబానికి న్యాయం చేయాలని రత్నకుమారి డిమాండ్ చేశారు. స్థానిక ఎస్సై వి.సుబ్రహ్మణ్యం సంఘటన స్థలానికి చేరుకుని, మృతుని కుటుంబ సభ్యులు, బంధువులతో చర్చించారు. వెంకట్రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

తహసీల్దార్ ఆఫీస్ వద్ద గుండెపోటుతో రైతు మృతి