ఫ జనసేన, టీడీపీ వాగ్వాదం
ఫ అభివృద్ధి పనుల శంకుస్థాపనలో రగడ
కొత్తపల్లి: కూటమిలో నాయకుల్లో కుంపటి రాజుకుంది.. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఇలా పనులకు శంకుస్థాపన చేయడం విమర్శలకు దారితీసింది.. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూడడం గమనార్హం. కొత్తపల్లి మండలం మూలపేట జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానానికి ప్రహరీ నిర్మాణానికి ఉపాధి హామీ పథకం నిధులు రూ.34 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిర్మాణానికి సోమవారం జనసేన పార్టీ నాయ కులు శంకుస్థాపన చేశారు. పాఠశాల అభివృద్ధి కమిటీ ఉండగా ప్రహరీ నిర్మాణానికి మీరెందుకు శంకుస్థాపన చేస్తారంటూ టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఏ విధంగా శంకుస్థాపన చేస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. దీనిపై మండల ఇంజినీరింగ్ అధికారి శ్రీనివాస్‌ను సాక్షి వివరణ కోరగా ప్రహరీ నిర్మాణానికి విడతల వారీగా ఉపాధి హామీ పథకం నుంచి రూ.34 లక్షలు మంజూరయ్యాయని అన్నారు. ఈ పనులకు సంబంధించి గ్రామ పంచాయతీ తరఫున తీర్మానం అందించాల్సి ఉందన్నారు. అయితే ఇంకా ఎటువంటి తీర్మానం ఇవ్వలేదని అన్నారు.