
కళాకారులకు కూనవరం
సాక్షి, అమలాపురం/ఉప్పలగుప్తం: కూనవరం. ఉప్పలగుప్తం మండలంలో ఒక కుగ్రామం. కానీ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులకు... కళాకారులకు.. కళాపోషకులకు పెట్టింది పేరు. నాటకాలను రక్తి కట్టించిన నటులు పుట్టిన గ్రామం. అలాగే తెరమరుగువుతున్న నాటకాన్ని పొత్తిళ్లలో పెట్టుకుని పోషిస్తున్న గ్రామం కూడా. ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన అక్కడి కర్షక గణపతి ఉత్సవ కమిటీ.. ఏటా నవరాత్రులు చేయడం.. సాంఘిక, పౌరాణిక నాటకాలు ప్రదర్శించే ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
కూనవరం గ్రామంలో పూర్వం వ్యాసాలు, కవితలు రచించిన పండితులు ఉండేవారు. అందుకే ఈ గ్రామాన్ని ‘పండిత కూనవరం’ అని పిలిచేవారని ఇక్కడ వారు చెబుతారు. తరువాత ఇక్కడ కళాకారులు పుట్టుకొచ్చారు. సాంఘిక నాటకాలు ప్రదర్శిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని కళాకారుల కూనవరంగా కూడా గుర్తింపు తెచ్చారు. వీరు నటించిన ‘పూలరంగడు, రక్త కన్నీరు, అల్లూరి సీతారామరాజు, కత్తుల రత్తయ్య, సారంగధర, బొబ్బిలి యుద్ధం, కుమారరాజా, చిల్లర కొట్టు చిట్టెమ్మ’ వంటి నాటకాలు సినీ ప్రముఖులతో శభాష్ అనిపించుకున్నాయి. గత ఎనభై ఏళ్లుగా సత్య హరిశ్చంద్ర, బాలనాగమ్మ, దేవనర్తకి, నర్తనశాల, రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం, కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, మనోహర్, మయసభ, కదలివచ్చిన కనకదుర్గ, తులసీ జలంధర, మహిషాసురమర్దిని, అన్నమయ్య, భూకై లాస్, మహావీర చంద్రసేన, వల్లీ కళ్యాణం, పౌరాణిక నాటకాలు ఏటా 250 నుంచి 300 కళాకారులతో ఈ ఉత్సవాల్లో ప్రదర్శనలు చేసి నాటకాలకు ఊపిరి పోస్తున్నారు.
సినీ నటుల ప్రదర్శన..
కర్షక గణపతి వేదికపై దివంగత హాస్య నటుడు పద్మనాభం పలుసార్లు దేవనర్తకి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర పోషించారు. ఇప్పుడు ఇదే నాటికలో జబర్దస్త్ నటుడు, సినీ హాస్యనటుడు అప్పారావు సుబ్బిశెట్టి పాత్రలో నటించనున్నారు. మహానటుడు ఎస్‌వీ రంగరావుకు ఈ గ్రామస్తులతో బంధుత్వం ఉంది. శ్రీరామ నవరాత్రులకు వచ్చిన ఎస్వీఆర్ ఇక్కడ వేదికపై అతిథి పాత్రలో మాయాబజార్‌లో ఘటోత్కచుడు, హిరణ్యకశిపుడుల్లోని డైలాగులు చెప్పి ప్రేక్షకులను అలరించారు. ఉమ్మడిగోదావరి జిల్లాలో ప్రముఖ నాటక కళాకారులు జగతా పెదకాపు, ఆచంట వెంకటరత్నంనాయుడు, షణ్ముఖ ఆంజనేయరాజు, మద్దాల రామారావు, ద్వారపూడి సూర్యారావు, పేపకాయల లక్ష్మణరావు, బెజవాడ రామారావు, యెరుబండి మునేశ్వరరావు, బత్తిన నాగేశ్వరరావు వంటి హేమాహేమీలు నటించారు. ఇప్పుడు నవరాత్రుల్లో నాటకాల ప్రదర్శన చాలా వరకు తగ్గింది. దీనితో నాటకాలతో పాటు బుర్రకథ, హరికథలు, పద్యనాటకాల పేరుతో పౌరాణిక నాటకాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
గణపతి ఉత్సవాల్లో నాటకాలకు ఊపిరి
ఎనిమిది దశాబ్దాల చరిత్ర
హాస్యబ్రహ్మ పద్మనాభం నుంచి..
నేటి జబర్దస్త్ అప్పారావు వరకు...
స్టేజ్ మీద అతిథి డైలాగులు చెప్పిన
దివంగత ఎస్వీఆర్

కళాకారులకు కూనవరం