
నాడు–నేడులో అద్భుతంగా రూపుదిద్దుకున్న శాటిలైట్ సిటీ ఉన్నత పాఠశాల
● ప్రభుత్వ, పైవేటు పాఠశాలల
నిర్వహణపై ఫోకస్
● నాణ్యమైన విద్య, వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి
● ఇందుకు ప్రతి మండలానికి
ఇద్దరు ఎంఈఓలు
● జిల్లాలో ఇప్పటికే
నియామక ప్రక్రియ పూర్తి
● ప్రభుత్వ సంస్కరణలు,
విధానాలు అమలయ్యేలా చర్యలు
సాక్షి, రాజమహేంద్రవరం: విద్యా రంగంలో అనేక సంస్కరణకు ప్రభుత్వం నాంది పలికింది. నిరుపేదల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించే దిశగా అనేక పథకాలు అమలు చేస్తోంది. నాడు–నేడుతో పాఠశాలల్లో వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తోంది. వసతులు, పథకాలు సమర్ధవంతంగా అమలయ్యేందుకు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాణ్యమైన విద్యా బోధన, సకాలంలో సిలబస్ పూర్తి చేయడం, పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా? లేదా? అన్న అంశాలపై నిరంతరం పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు గాను ప్రతి మండలానికీ ఇద్దరు ఎంపీఓలను (మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్) నియమించింది. వీరికి పని విభజన కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల ఉత్తర్వులు వెలువరించారు. ప్రభుత్వ నిర్ణయంతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మండలానికి ఇద్దరు ఎంఈఓలు
జిల్లా వ్యాప్తంగా 1,578 పాఠశాలలున్నాయి. అందులో ప్రభుత్వ 986, ప్రైవేటు 592 ఉన్నాయి. వీటిలో సుమారు 2,88,336 లక్షల మంది చదువుతున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ఆధునాతనంగా తీర్చి దిద్దింది. ప్రైవేటు, కార్పోరేట్ స్కూళ్లకు దీటుగా వసతులు కల్పించింది. ఇంగ్లిష్ మీడియం పరిచయం చేసింది. వర్చువల్ పద్ధతిలో విద్యా బోధన సాగుతోంది. టోఫెల్ విధానంలో పరీక్షలు, సీబీఎస్‌ఈ సిలబస్, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు సైతం పంపిణీ చేసింది. ఇవి పక్కాగా విద్యార్థుకు చేరుతున్నా యా? లేదా? అమలవుతున్నాయా? అన్న విషయాలపై నిఘా వేయడం ఎంఈఓల విధిగా నిర్దారించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పకడ్బందీగా అమలయ్యేలా చూడటం వీరి బాధ్యతగా నిర్ణయించారు. ఇప్పటికే మండలానికి ఒకరు చొప్పున 19 మంది ఎంఈఓలు ఉంటే తాజాగా ఎంఈఓ–2తో మరో 19 మందిని నియమించారు.
ఎంఈఓల విధులు
● ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ప్రతి నిత్యం సందర్శించాలి. పాఠశాలను నిశితంగా తనిఖీ చేపట్టాలి. ఉపాధ్యాయులకు శిక్షణ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన కార్యక్రమాలు అమలయ్యేలా చూడాలి. పాఠశాలల పర్యవేక్షణ, స్కూళ్లల్లో అవసరమైన వాటిని అంచనా వేసే బాధ్యతను ఎంఈఓ–1కు కేటాయించారు.
● పాలన (అడ్మినిస్టేషన్) పరంగా పాఠశాలల స్థాపన, గుర్తింపు ప్రక్రియ, వాటిని బలోపేతం చేయడం. ఉపాధ్యాయుల సర్వీస్‌కు సంబంధించిన అంశాలతో పాటు అధికారులు కేటాయించిన ఇతర విధులను సైతం వీరు పర్యవేక్షిస్తారు.
● పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్, పాఠశాల మానేసి బడిబయట ఉన్న పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం. ఒకేషనల్ ఎడ్యుకేషన్‌పై శ్రద్ధ పెట్టాలి. ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించిన అంశాలు, ఛైల్డ్ డేటా, బేస్‘యూ’ డైస్ నిర్వహణ లాంటి వాటిని ఎంఈఓ–2 పర్యవేక్షించాలి.
● ‘నాడు–నేడు పథకంలో వసతుల కల్పన, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పుస్తకాలు అందాయా లేదా? అన్న విషయాలపై పర్యవేక్షించాలి. మధ్యాహ్న భోజనం సక్రమంగా పెడుతున్నారా? లేదా? అని తనిఖీలు చేయాలి. మధ్యాహ్న భోజన నిధులు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ పథకాల అమలు, పాఠశాలల భద్రత లాంటి విధులు నిర్వర్తించాలి.
జిల్లాలో పాఠశాలలు
పాఠశాల హైస్కూల్ పీఎస్ యూపీ మొత్తం
ప్రభుత్వ 201 712 73 986
ప్రైవేటు 207 861 309 592
మొత్తం 408 861 309 1578
పాఠశాలల్లో విద్యార్థులు
పాఠశాల హైస్కూల్ పీఎస్ యూపీ మొత్తం
ప్రభుత్వ 80,457 32,417 9,482 1,22,356
ప్రైవేటు 82,915 43,524 39,541 1,65,980
మొత్తం 1,63,372 75,941 49,023 2,88,336
నియామక ప్రక్రియ పూర్తి
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మండలానికి ఇద్దరు ఎంఈఓల నియామకం చేపట్టాం. వారు ఎలాంటి విధులు నిర్వర్తించాలన్న విషయమై స్పష్టత ఇచ్చాం. ఇకపై పాఠశాలలను ఇద్దరు ఎంఈఓలు పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పాఠశాలలపై మరింత నిఘా పెరుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సదుపాయాలు మెరుగుపడుతాయి. ఆయా మండలాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అకడమిక్ క్యాలెండర్, ప్రభుత్వ పథకాలు సకాలంలో చేపట్టేలా చర్యలు చేపట్టాలి.
– ఎస్.అబ్రహం, డీఈఓ
ప్రైవేటు ఆగడాలకు అడ్డుకట్ట
కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న అకడమిక్ పుస్తకాలతోనే విద్యా బోధన చేపట్టాలని నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అకడమిక్ పుస్తకాలను వినియోగించకుండా సొంతంగా రూపొందించుకున్న తమ మెటీరియల్‌ను విద్యార్థులకు బలవంతంగా అంటగడుతున్నారు. వేలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి గుంజుతున్నారు. వాళ్లకు ఇష్టం వచ్చిని విధంగా బోధన సాగిస్తున్నారు. ఆయా తరగతులకు ఫార్మేటివ్, సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఇలాంటి అక్రమ వ్యవహారాలపై చర్యలు తీసుకునేందుకు, వాటిని చక్కదిద్దేందుకు ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈఓలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నియమించింది.

