
పూర్ణాహుతితో చవితి ఉత్సవాలకు ముగింపు పలుకుతున్న పండితులు
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో చవితి మహోత్సవాల ముగింపు కార్యక్రమాలను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చవితి మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి విశేష అభిషేకాలు, పూజలు, లక్షగరిక పూజ నిర్వహించారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి పంచహారతులు ఇచ్చారు. వేదపండితుల ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమంతో చవితి మహోత్సవాలకు ముగింపు పలికారు. ఆలయ చైర్మన్ గుత్తుల నాగబాబు, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు (సతీష్‌రాజు) కార్యక్రమాలను పర్యవేక్షించారు. స్వామికి గ్రామోత్సవం జరిపారు. స్వామివారి ప్రసాదంగా ఉండ్రాళ్లు పంచారు. మేళాతాళాల మధ్య స్వామిని ఊరేగించారు. బాణసంచా కాల్చారు. కేరళ వాయిద్యాలు, గరగ నృత్యాలు, విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. తొమ్మిదో రోజు మంగళవారం రాత్రి 9.15గంటలకు పూజలు అందుకున్న మట్టి గణపతి విగ్రహాన్ని సమీప పంటకాలువలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
ఏడుగురు హిజ్రాలకు జైలు
కాకినాడ లీగల్: తాళ్ళరేవు మండలం లచ్చిపాలెం ఎన్‌హెచ్–16 రహదారిపై వెళుతున్న వాహనదారులను ఆపి వారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో కోరంగి పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాస్‌కుమార్ 24వ తేదీన కేసు నమోదు చేశారు. ఏడుగురు హిజ్రాలను మంగళవారం కాకినాడ కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి 24 గంటల జైలు శిక్ష విధిస్తూ కాకినాడ ఒకటో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హెచ్ వీరభద్రుడు తీర్పు చెప్పారు. హిజ్రాలను సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
మాదక ద్రవ్యాలతో ముప్పు
ఆర్‌ఎంసీలో అవగాహన సదస్సు
కాకినాడ క్రైం: మాదక ద్రవ్యాలు నిండు జీవితానికి ముప్పును తీసుకొస్తాయని వైద్య ప్రముఖులు వెల్లడించారు. మాదక ద్రవ్యాల వినియోగ నివారణే లక్ష్యంగా వైద్య విద్యార్థులకు ఆర్‌ఎంసీ యాజమాన్యం ఆర్‌ఎంసీ మెన్ హాస్టల్‌లో అవగాహన సదస్సు నిర్వహించింది. ఆర్‌ఎంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్థన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి మానసిక, సామాజిక బలహీనతలకు లొంగొద్దని కోరారు. తల్లిదండ్రులు మీ భవితపై కొండంత ఆశతో ఉన్నారని గుర్తు చేశారు. వైద్య విద్యార్థులుగా ఆరోగ్యవంతమైన, ఆదర్శవంతమైన జీవన శైలితో సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని తెలిసినా, విక్రయిస్తున్న ఉదంతాలు బయటపడినా తక్షణమే కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇవ్వాలన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ఉన్నత విద్యావంతులు కూడా ఉన్మాదులుగా మారిన దాఖలాలు ఉన్నాయని ఉదాహరణలతో వివరించారు. ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్, డీఎంఈ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం సూచనలతో జరిగిన ఈ సదస్సులో సైకియాట్రీ నిపుణులు డాక్టర్ రామచంద్రరావు, డాక్టర్ వరప్రసాద్, ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ ఫణికిరణ్, పల్మనాలజీ నిపుణురాలు డాక్టర్ సూర్యకుమారి, హాస్టల్ వార్డెన్ డాక్టర్ వీరయ్య, క్యాంపస్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ పాల్గొన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్ రామచంద్రరావు