పశుగ్రాసంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పశుగ్రాసంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌

Jul 27 2026 12:12 AM | Updated on Jul 27 2026 12:12 AM

ఐ.పోలవరం: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించినంత మేర కురవకపోవడంతో జిల్లాలో ఈ ఏడాది పశుగ్రాసానికి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో పశుగ్రాసాన్ని నిల్వ చేసుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చని పశు సంవర్ధక శాఖ అధికారులు పాడి రైతులకు సూచిస్తున్నారు. ఆ సూచనలివీ..

ఫ కరవు పరిస్థితులను తట్టుకునే జొన్న, సజ్జ, మొక్కజొన్న, స్టైలో, హెడ్జ్‌ లూసెర్న, గినియా గడ్డి వంటి పశుగ్రాస పంటలు సాగు చేయాలి. ఇవి తక్కువ నీటితో పెరుగుతాయి. నీటి వసతి ఉన్న రైతులు సీఓ–4, సీఓ–5 హైబ్రిడ్‌ నేపియర్‌, గినియా గడ్డి, పారా గడ్డి సాగు చేస్తే ఏడాది పొడవునా పచ్చి మేత అందుబాటులో ఉంటుంది. బహు సంవత్సరాల రకాలను పెంచడం వల్ల ప్రతి 45 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు.

ఫ వరి కోత తర్వాత మిగిలే గడ్డిని వృథా చేయకుండా యూరియా, ఖనిజ మిశ్రమంతో శుద్ధి చేసి, పశువుల మేతగా ఉపయోగించాలి. దీనివలన గడ్డి పోషక విలువ 30 శాతం వరకూ పెరుగుతుంది. అలాగే, మొక్కజొన్న కాండాలు, వేరుశనగ తొక్కు వంటి పంట అవశేషాలను కూడా దాణాగా మార్చుకోవచ్చు.

ఫ గ్రామాల్లోని సామూహిక మేత భూములను సంరక్షించి, వర్షాలు కురిసిన వెంటనే గడ్డి విత్తనాలు జల్లి పునరుద్ధరించుకోవాలి. నియంత్రిత మేత విధానం పాటించడం ద్వారా గడ్డి తిరిగి పెరిగే అవకాశం ఉంటుంది. పొలాల గట్లపై సుబాబుల్‌, అగస్త్య, గ్లిరిసిడియా, మునగ వంటి పశుగ్రాస చెట్లను నాటితే ఆకు మేతతో పాటు నీడ కూడా లభిస్తుంది. లంక గ్రామాల వాసులు ఏటిగట్ల మీద కూడా పశువుల మేత పెంచుకునే అవకాశముంది.

ఫ నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో అజోల్లా, హైడ్రోపోనిక్‌ పద్ధతిలో పచ్చిమేత ఉత్పత్తిని ప్రోత్సహించాలి. 20 చదరపు అడుగుల స్థలంలో అజోల్లా పెంచితే రోజుకు 2 కిలోల వరకూ మేత వస్తుంది. దీనిలో ప్రోటీన్‌ ఎక్కువగా ఉండటంతో పాల దిగుబడి పెరుగుతుంది. హైడ్రోపోనిక్‌ పద్ధతిలో 7 రోజుల్లోనే మొక్కజొన్న, జొన్న గింజల నుంచి పచ్చి మేత తయారు చేయవచ్చు.

ఫ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు భూమిని లీజుకు తీసుకుని గ్రామ స్థాయిలో పచ్చి పశుగ్రాసం సాగు చేసి, సభ్యులైన రైతులకు తక్కువ ధరకే నిరంతరం సరఫరా చేయాలి. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతులకు ఆర్థిక భారం తగ్గుతుంది.

ఫ పశుగ్రాసం కొరత ఉన్న సమయంలో అధిక ఉత్పాదకత కలిగిన పశువులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. అవసరానికి మించి పశువులను పెంచవద్దు. కరవును బాగా తట్టుకునే గొర్రెలు, మేకలు, దేశీ పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి. పంటలు దెబ్బ తిన్నా ఇవి రైతులకు స్థిరమైన ఆదాయాన్నిస్తాయి. వేసవి తీవ్రత, వర్షాభావం వల్ల పశువులకు వేడి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటికి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. పశువుల కొట్టాల్లో గాలి వెలుతురు, నీడ ఉండేలా చూసుకోవాలి.

ఫ కరవు పరిస్థితులను

తట్టుకునే రకాలు సాగు చేయాలి

ఫ పంట అవశేషాలను

వినియోగించుకోవాలి

ఫ మేత భూములను పునరుద్ధరించుకోవాలి

ఫ రైతులకు పశు సంవర్ధక శాఖ సూచన

దాణా అందుబాటులో ఉంది

పశువుల దాణా 50 కేజీల బస్తా రూ.1,020కే అందుబాటులో ఉంది. రైతులు పశుగ్రాస భద్రత కల్పించుకోవాలి.

– డాక్టర్‌ ప్రవీణ్‌, పశు వైద్యాధికారి,

ఎదుర్లంక, ఐ.పోలవరం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement