కొత్తపేట: ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రతి డ్రైవర్ లక్ష్యంగా ఏపీఎస్ ఆర్టీసీ ఏటా జూలై 25 నుంచి 31వ తేదీ వరకూ ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని రావులపాలెం, అమలాపురం, రాజోలు ఆర్టీసీ డిపోల అధికారులు శనివారం నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సుల డ్రైవర్లు, గతంలో ప్రమాదాలు చేసిన వారు, ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లకు గ్యారేజీల్లో అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రమాద నివారణ చర్యలు తెలియజేస్తూ, డిపో పరిధిలో గతంలో ప్రమాదాలు జరిగిన స్థలాలకు తీసుకువెళ్లి స్వయంగా చూపించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. జీరో యాక్సిడెంట్లే లక్ష్యమంటూ డ్రైవర్లు, కండక్టర్లకు భద్రతా కార్డులు ఇస్తున్నారు.
డ్రైవర్లకు జాగ్రత్తలు
ఫ బస్సు బయలుదేరడానికి 20 నిమిషాల ముందు వచ్చి గ్యారేజీలో బస్సు కండిషన్ సరిచూసుకోవాలి. బ్రేకులు, స్టీరింగ్, లైట్లు, టైర్లు తదితర సాంకేతిక అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. బస్సు నడిపే రూటుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
ఫ బస్టాండు లోపలకు వెళ్లే, బయటకు వచ్చే ప్రాంతాలు, గ్రామ/పట్టణ కూడళ్లు, స్కూల్, ఆఫీస్ జోన్ల వద్ద పాదచారులు, ద్విచక్ర వాహనాల కదలికలను గమనిస్తూ బస్సును నెమ్మదిగా నడపాలి.
ఫ బస్సు నడిపే ముందు బ్లైండ్ స్పాట్లలో పాదచారులు, ఇతర వాహనాల కదలికలను గమనించాలి.
ఫ ఆరు లేదా నాలుగు వరుసల జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఎడమ లేన్‌లోనే బస్సు నడపాలి. మలుపుల వద్ద తప్పనిసరిగా ఇండికేటర్లు వాడాలి.
ఫ సెల్‌ఫోన్ డ్రైవింగ్ వద్దు.
ఫ ప్రయాణికులు, సిబ్బంది బోనెట్‌పై కూర్చోవడానికి అనుమతించరాదు. వారితో మాట్లాడుతూ బస్సు నడపరాదు.
ఫ బస్సు రివర్స్ చేసేటప్పుడు కండక్టర్ లేదా బస్సు స్టేషన్ సిబ్బంది సహాయం పొందాలి.
ఫ స్టేజీలో ప్రయాణికులు దిగి, ఎక్కిన తరువాత కండక్టర్ సూచనల మేరకు మాత్రమే బస్సును కదల్చాలి.
ఫ ముందు వెళ్తున్న వాహనాలను అధిగమించేటప్పుడు ఎదురుగా లేదా వెనుక వస్తున్న వాహనాలను కూడా గమనించి, సరైన సిగ్నల్ ఇవ్వాలి.
ఫ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
ఫ అతి వేగం, అసహనంతో నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం తాగి బస్సు నడపడం వంటివి మానాలి.
ఫ డ్రైవింగ్ సమయంలో అలసటగా అనిపిస్తే వెంటనే బస్సు ఆపి, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.
ఫ తడి రోడ్లపై మరింత అప్రమత్తంగా ఉండాలి.
ఫ ఘాట్ రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వేగాన్ని నియంత్రించాలి.
ఫ ఆర్టీసీలో ప్రమాద రహిత వారోత్సవాలు
ఫ సురక్షిత డ్రైవింగ్‌పై డ్రైవర్లకు శిక్షణ


