తాళ్లరేవు: దేశంలోనే రెండో అతి పెద్ద మడ అటవీ ప్రాంతం కోరింగా అభయారణ్యం, మడ అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే అన్నారు. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా కోరింగా అభయారణ్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ టి.జ్యోతి మాట్లాడుతూ, కోరింగా ప్రాంతంలో విస్తారంగా ఉన్న మడ అడవులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు ఆధ్వర్యాన ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


