వెంటనే సాగునీరు అందించాలి | - | Sakshi
Sakshi News home page

వెంటనే సాగునీరు అందించాలి

Jul 18 2026 3:35 AM | Updated on Jul 18 2026 3:35 AM

లేకుంటే ధవళేశ్వరంలోని ఇరిగేషన్‌

ఎస్‌ఈ కార్యాలయం ముట్టడి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

చిర్ల జగ్గిరెడ్డి హెచ్చరిక

బిళ్లకుర్రు పంట కాలువ సందర్శన

రైతులతో కలసి ఆందోళన

కొత్తపేట: మండలంలోని వాడపాలెం ఓల్డ్‌ చానల్‌ కింద బిళ్లకుర్రు కాలువకు రెండు రోజుల్లో సాగునీరు అందించాలని, లేకుంటే ధవళేశ్వరంలోని ఇరిగేషన్‌ ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు ఇరిగేషన్‌ ఎస్‌ఈతో ఫోనులో మాట్లాడి, సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులకు మొర పెట్టుకున్నా బిళ్లకుర్రు గ్రామ పరిధిలోని సుమారు వంద ఎకరాలకు సాగునీరు రాక, అక్కడి రైతులు ఈ నెల 6 నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ నెల 14న పురుగు మందు డబ్బా చేతపట్టి, ఆత్మహత్యలే శరణ్యమంటూ వారు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌ అధికారులు కాలువను పరిశీలించి, ఎగువన జేసీబీతో రెండు రోజులు పూడిక తీశారు. కానీ, కిందికి మాత్రం నీరు చేరలేదు. దీంతో, రైతులు శుక్రవారం మరోసారి బిళ్లకుర్రు నక్కావారిపేట వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన జగ్గిరెడ్డి.. బాధిత రైతులకు మద్దతు తెలిపారు. వారితో కలసి, కాలువలో కూర్చుని నిరసన తెలిపారు. వెంటనే సాగునీరివ్వాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపుతూ కాలువలో మోటార్‌ సైకిల్‌ నడిపారు. ‘ఈ పాలకులు, అధికారులు మా చేలకు సాగునీరు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మీరు స్పందిస్తేనే మాకు సాగునీరు వస్తుంది’ జగ్గిరెడ్డికి రైతులు తమ కష్టాలు విన్నవించుకున్నారు.

ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం

ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏటా రైతులు రబీలో సాగునీటి కష్టాలు ఎదుర్కొంటారని, అటువంటిది ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యంతో ఖరీఫ్‌లోనే నానా అగచాట్లూ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి రైతు సదస్సులో సాగునీటిపై సీఎం చంద్రబాబు చెప్పిన మాటలకు, ఆచరణకు ఎక్కడా పొంతన లేదన్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలోనే రైతులు సాగునీటి కోసం పంట కాలువలో ఎండ్రిన్‌ బాటిల్‌ పట్టుకుని నిరసన చేపట్టాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రతి ఖరీఫ్‌లో అన్ని పంట కాలువల ద్వారా రోజుకు 11 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే ఉభయ గోదావరి జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సరిపోయేదని, అటువంటిది ఈసారి 14,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా, సరైన నిర్వహణ లేక పంట కాలువల నుంచి ఆ నీరు బోదెల్లోకి చేరడం లేదని అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. వేసవిలో కాలువల మరమ్మతులు, పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులకు నియోజకవర్గానికి రూ.3 కోట్లు కేటాయించినట్లు మంత్రులు ప్రకటించారని, వీటితో రైతులకు ఉపయోగపడే ఒక్క పనీ జరగలేదని, ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. సెంట్రల్‌ డెల్టా ప్రధాన కాలువ ప్రారంభంలో ఉన్న కొత్తపేట నియోజకవర్గంలోనే శివారు భూములకు నీరు పూర్తిగా అందడం లేదంటే.. ఇక కింది ప్రాంతాల రైతుల ఇబ్బందులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని అన్నారు. సాగునీరు ఇవ్వలేని పక్షంలో చెల్లించిన శిస్తుల మొత్తాన్ని ఆయా రైతులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఇద్దరు నీటిసంఘం డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేయడం కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినట్టేనని జగ్గిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీ మార్గన గంగాధరరావు, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు కాకర సర్వేశ్వరరావు, పార్టీ నేత గోలకోటి సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement