ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి

Jul 18 2026 3:35 AM | Updated on Jul 18 2026 3:35 AM

అమలాపురం టౌన్‌: కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్ల యూనియన్‌ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక కూరగాయల మార్కెట్‌ సమీపాన ఉన్న సీఐటీయూ జిల్లా కార్యాలయంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బి.ఎస్తేర్‌ రాణి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ఈ నెల 30, 31 తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పాలకుల అసంబద్ధ విధానాల వల్ల కార్మికులు, విద్యార్థులు, యువకులు, రైతులు, ఉద్యోగులు తదితర అన్ని వర్గాల వారూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కలెక్టరేట్‌ వద్ద చేపట్టనున్న ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఈ సందర్భంగా విడుదల చేశారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి మలకా సుభాషిణి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

హాస్టళ్లలో సౌకర్యాలు

మెరుగుపరచండి

కొత్తపేట: ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ కె.నాగమానస సూచించారు. స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలను, ప్రభుత్వ బాలురు, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలను ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ ఆరో తరగతి చదువుతున్న బాలుడు కె.అఖిల్‌ (తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం) అనారోగ్యానికి గురై ఈ నెల 11న రాత్రి రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందిన సంఘటనపై ఆరా తీశారు. ఆ బాలుడు ఫిట్స్‌ వచ్చి చనిపోయాడని చెబుతున్నారన్నారు. హాస్టల్‌లో 136 మంది బాలలకు 4 రూములు మాత్రమే ఉన్నాయన్నారు. రూముల సంఖ్య పెంచాలని సాంఘిక సంక్షేమ శాఖకు సూచించామన్నారు. వంటలో పామాయిల్‌ వాడవద్దని, అది పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పారు. విద్య, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖల అధికారులు, ఆరోగ్య సిబ్బందితో కూడా డాక్టర్‌ మానస సమీక్షించారు. బాలికల హాస్టల్‌లోని పిల్లలు రోడ్డు మీదకు వస్తున్నారని, సరైన రక్షణ, పర్యవేక్షణ లేదంటూ ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో టాయిలెట్లు బాగోలేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్‌, సీడీపీఓ ఎ.గజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి

ఉద్యోగుల నిరసన

అమలాపురం రూరల్‌: జిల్లాలోని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అమరావతి ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వీఎస్‌ దివాకర్‌ డిమాండ్‌ చేశారు. పన్నెండో పీఆర్‌సీని వెంటనే నియమించాలని, తక్షణం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన ఉద్యోగులు కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. దివాకర్‌ మాట్లాడుతూ, బకాయిల విడుదల, ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఏపీ జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అమరావతి ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్‌ పనిశెట్టి దామోదర్‌లు మంత్రులతో చర్చలు జరిపారని చెప్పారు. పెండింగ్‌ డీఏల విడుదల, రిటైర్డ్‌ ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ పునరుద్ధరణ, మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్‌ లీవ్‌ పెంపుదల, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాల వర్తింపు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గెజిటెడ్‌ హెడ్మాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.ప్రకాష్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కల్యాణ్‌, మున్సిపల్‌ ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీనివాస్‌, వీఆర్‌ఓ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మద్దాల బాబూజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement