ఫ జిల్లాలో ఖరీఫ్‌కు నేటికీ అందని జలాలు
ఫ మే 31న విడుదల చేస్తున్నట్టు హడావుడి
ఫ ముక్తేశ్వరం కాల్వకు లొల్ల వద్దే
నిలుపుదల
ఫ అమలాపురం కెనాల్‌కు నడిపూడి వద్ద బంద్
ఫ ముందస్తు సాగుకు గ్రహణం
సాక్షి, అమలాపురం: ముందస్తు సాగుకు ముందుకు రండి అన్నారు.. సాగునీరు ఇచ్చినట్టే ఇచ్చి అడ్డంకులు సృష్టించారు.. గోదావరి డెల్టా పరిధిలో ఖరీఫ్ సాగును అధికారులు అపహాస్యం చేస్తున్నారు. ముందస్తు సాగుకు ఒకరోజు ముందే సాగునీరు విడుదల చేసినట్టు భారీ ప్రచారానికి తెర తీసిన ప్రభుత్వం, ఇప్పటి వరకూ చుక్కనీటిని కూడా దిగువకు వదలడం లేదు.
తుపాన్‌లు, భారీ వర్షాలు వంటి విపత్తుల నుంచి పంట ముంపు బారిన పడకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందస్తు సాగు విధానాన్ని అమలులోకి తెచ్చింది. మిగిలిన ప్రాంతాల రైతులు కన్నా ఇది గోదావరి డెల్టా రైతులకు ఎక్కువ మేలు చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం ముందస్తు సాగును ప్రహసనంగా మార్చేసింది. రైతులను ఉద్దరిస్తున్నామనే ప్రచారం కోసం గత నెల 31న డెల్టా కాలువలకు నీరు విడుదల చేసింది. గేట్లు ఎత్తి అతి తక్కువ నీరు విడుదల చేసి ప్రచారం మాత్రం భారీగా చేసుకుంది. కానీ మధ్య డెల్టాలో మూడు ప్రధాన పంట కాలువలకు ఇప్పటి వరకూ నీరు రాకపోవడం గమనార్హం.
అక్కడే ఆపేసి..
బొబ్బర్లంక హెడ్ స్లూయిజ్ నుంచి విడుదలైన నీరు లొల్ల లాకుల వరకూ వచ్చి నిలిచిపోయింది. దిగున కాలువల మీద క్లోజర్ పనులు చేస్తున్నామని చెప్పి, అధికారులు అక్కడే నీళ్లు ఆపేశారు. జూన్ మొదటి వారం అయిపోతున్నా, పంట కాలువల్లో నీరు పారని పరిస్థితి ఏర్పడింది. దీనిపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో జలవనరుల శాఖ అధికారులు శనివారం నీటి విడుదలను పెంచారు. మధ్య డెల్టాకు శనివారం ఉదయం నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ పంట కాలువల్లో నీరు పూర్తి స్థాయిలో పారే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు కూడా నీరు విడుదల చేసినా పలుచోట్ల ఆటంకాలు కల్పిస్తున్నారు. జిల్లాలో ముకేశ్వరం బ్యాంక్ కెనాల్‌కు సంబంధించి లొల్ల లాకుల వద్దే నీటిని నిలిపివేయనున్నారు. అలాగే అమలాపురం కాలువకు సంబంధించి నడిపూడి లాకుల వద్ద నీటిని నిలిపిస్తారు. ఒక్క పి.గన్నవరం బ్యాంక్ కెనాల్‌కు మాత్రమే నీటిని విడుదల చేయనున్నారు. అధికారుల నిర్ణయం వల్ల ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో సుమారు 60 వేల ఎకరాల్లో సాగు ఆలస్యం కానుంది.
ఇక్కడ మరింత ఆలస్యం
అమలాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఈ ఏడాది కూడా సాగు ఆలస్యం కానుంది. అటు అమలాపురం – చల్లపల్లి, ఇటు అమలాపురం– అల్లవరం (బెండా కెనాల్) మీద వంతెన నిర్మాణాలు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. ఈ కారణంగా ఈ రెండు కాలువలపై ఎగువన ఉన్న నడిపూడి లాకుల వద్ద నీరు నిలుపుదల చేశారు. ఇక్కడ పనులు ఒక దశకు వచ్చే వరకూ నడిపూడి లాకుల నుంచి నీరు విడుదల చేసే అవకాశం లేదు. గత ఏడాది కూడా సాగునీరు సకాలంలో అందకుండా చేశారు. ఈదరపల్లి, నడిపూడి వద్ద అమలాపురం, బెండా కెనాల్‌పై వంతెన నిర్మాణం పేరుతో గత ఏడాది జూన్ 20 తరువాత కానీ దిగువకు నీరు వదలలేదు. దీనితో అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లోని శివారు ప్రాంతాల్లో రైతులు సుమారు 5 వేల ఎకరాల్లో సాగు చేయకుండా వదిలేశారు. ఈ ఏడాదీ ఇలానే చేసే అవకాశం ఉందనే ప్రచారంతో రైతులు మండి పడుతున్నారు. ఈ నెల 10వ తేదీ తరువాత సాగునీరు వదలకుంటే ఊరుకునేది లేదని రైతులు అల్టిమేటం జారీ చేశారు.
నీరివ్వకున్నా ముందస్తు సాగుకు..
ఇది అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం. ఇక్కడకు సాగునీరు రాకున్నా, రైతులు బోరు నీరు ద్వారా సాగుకు సిద్ధమవుతున్నారు. భూమిని దుక్కు దున్నేందుకు మోటారు ద్వారా నీరు పెడుతున్నారు. పంట కాలువ ద్వారా సాగునీరు ఆలస్యంగా అందినా ఇబ్బంది లేకుండా ముందస్తు సాగు చేసే ఆలోచనతో రైతులు ఉన్నారు. ఇదే విధంగా పలువురు ముందుస్తు సాగు చేసి పంటలు తుపాను బారిన పడకుండా చూసుకునే పనిలో పడ్డారు. జలవనరుల శాఖ అధికారులు మాత్రం సకాలంలో నీరందించడంలో విఫలమవుతున్నారు.


