మొక్కవోని నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మొక్కవోని నిర్లక్ష్యం

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

నర్సరీలను గాలికొదిలేసిన అటవీ శాఖ

ఎండిపోతున్న మొక్కలు

పనులకు దూరమైన ఉపాధి కూలీలు

కొత్తపేట: మొక్కవోని నిర్లక్ష్యం అలుముకుంది.. ఉపాధి కూలీలకు పని దూరమైంది.. ఫలితంగా నర్సరీల్లో పచ్చదనం ఆవిరి అయ్యింది. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌), మండల ప్రజా పరిషత్‌ల సహకారంతో అటవీ శాఖ సామాజిక వన విభాగం కింద నర్సరీలు ఏర్పాటు చేసింది. ఆ నర్సరీల్లో పెంచిన మొక్కలు గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఆ సంస్థల ఆయా ప్రాంగణాలు, ఖాళీ స్థలాల్లో నాటి సంరక్షించాలి. అయితే ప్రస్తుతం నర్సరీల నిర్వహణ గాలికొదిలేశారు. ఫలితంగా నర్సరీల్లో రూ.లక్షల విలువైన మొక్కలు ఎండిపోతున్నాయి. కొత్తపేట మండలం అవిడి గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 2024–25 సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నర్సరీ పనులు చేపట్టారు. దీనికోసం 8 పనుల కింద మొత్తం రూ.42.53 లక్షలు మంజూరు కాగా, ఇందులో వేతనాల రూపంలో రూ.16.68 లక్షలు, మెటీరియల్‌ ఖర్చుల కింద రూ.25.85 లక్షలు కేటాయించారు. 3,965 పని దినాలకు వేతనాల రూపంలో రూ.11.88 లక్షలు, మెటీరియల్‌ రూపంలో రూ 18.91 వెచ్చించారు. ఈ నర్సరీల్లో పెంచిన మొక్కల్లో సుమారు 60 శాతం గత ఏడాది వర్షాకాలానికి ముందే పంపిణీ చేయగా, మిగిలిన మొక్కలు వర్షాకాలంలో పంపిణీ చేయాలి. కానీ పంపిణీ జరగలేదు. ఫలితంగా సుమారు 40 శాతం మొక్కలు నర్సరీలోనే ఉండిపోయాయి. వాటిని సంరక్షించే వారు లేక ఎండిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందుగానే అంటే గత ఏడాది నవంబర్‌, డిసెంబర్‌లో సంబంధిత అటవీ శాఖ అధికారులు ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపించాలి. అది జరగకపోవడంతో నిర్వహణ పనులకు ఆమోదం లభించలేదని సమాచారం. ఫలితంగా నర్సరీల్లో కవర్లలో మట్టి నింపడం, విత్తనాలు వేయడం, నారు పాతడం, వేర్లు భూమిలోకి వెళ్లకుండా వేరే కవర్లలోకి మార్చడం, నీరు పోయడం వంటి పనులు చేసే కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. అలాగే కొత్తపేట డిగ్రీ కళాశాల, అవిడి, ఆత్రేయపురం మండలం కట్టుంగ, మెర్లపాలెం, రాయవరం మండలం చెల్లూరు, అమలాపురం మండలం కామనగరువు, అయినవిల్లి మండలం శానపల్లిలంకలో సుమారు రూ 2.05 కోట్లతో అటవీశాఖ నర్సరీలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో నర్సరీల్లో మిగిలిపోయిన మొక్కల సంరక్షణ లేక ఎండిపోతున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement