యుద్ధప్రాతిపదికన పనులు చేయండి | - | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన పనులు చేయండి

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలోని పంట కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ జల వనరుల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో సమ్మర్‌ క్లోజర్‌ పనుల పురోగతిపై జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ జలవనరుల శాఖ ఇంజినీర్లతో స్థానికంగా సమీక్ష సమావేశం జరిపారు. ప్రభుత్వం చేపట్టిన జలధార– జలహారతి పనులను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే పంట కాలువలకు సాగునీటిని విడుదల చేశారని, శివారు భూములకు సైతం సాగునీరు సజావుగా అందేలా పూడికతీత పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. సమీక్షలో జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్‌ వెంకటేశ్వరరావు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి ప్రత్యూష పాల్గొన్నారు.

త్రిపుర హైకోర్టు జడ్జి పూజలు

ఆత్రేయపురం/ సఖినేటిపల్లి: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలోని చరిత్ర ప్రసిద్ధి గాంచిన జగన్మోహినీ కేశవస్వామి ఆలయాన్ని శనివారం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఎస్‌ రామచంద్రరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి తొలుత ఆలయంలో సిబ్బంది, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేయించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయ సిబ్బంది మేడిద శ్రీనివాస్‌ స్వామివారి చిత్రపటం అందజేశారు. అలాగే అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని త్రిపుర హైకోర్టు జస్టిస్‌ రామచంద్రరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

చెరువుల తొలగింపు

కాట్రేనికోన: పల్లంకుర్రు పంచాయతీ గొల్లగరువులోని గోదావరి పెరుగులంక భూమిలో చెరువులను జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు తొలగించారు. గోదావరి పెరుగులంక భూమిలో అక్రమ చెరువుపై బలుసుతిప్పకు చెందిన కర్రి శేషాద్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ ఆదేశాలతో ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో అనధికారంగా సాగు చేస్తున్న రెండు ఎకరాల్లో చెరువులను ధ్వంసం చేశారు.

భక్తజన సంద్రమైన

రత్నగిరి

అన్నవరం: వేలాదిగా భక్తులు తరలిరావడంతో రత్నగిరి శనివారం భక్తజన సంద్రంగా మారింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. దీంతో, క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం కిటకిటలాడాయి. మొత్తం 2,200 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement