అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదటి శిరీష్ అన్నారు. దీనిని రాబోయే రోజుల్లో ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వెనుక వీధిలో శిరీష్ అధ్యక్షతన శనివారం జిల్లా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. ఆ కార్యాచరణ ప్రణాళికపై జరిగిన చర్చలో శిరీష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై ఎప్పటికప్పుడు పార్టీ విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆందోళనలను చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరుకు దిగాలని ఆయన సూచించారు. పార్టీ విద్యార్థి విభాగం నాయకులే కాకుండా యువజన, ఐటీ, సోషల్ మీడియా విభాగాల నాయకులు కూడా పాల్గొని కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో నేతలు ఉంగరాల సంతోష్, తోరం గౌతమ్‌రాజా, దొమ్మేటి సత్యమోహన్, జిల్లెళ్ల రమేష్, మద్దింశెట్టి ప్రసాద్, తాడి సహదేవ్, పందిరిపల్లి అజయ్‌కుమార్, రాజేష్, దేవరపల్లి గౌతమ్, చొల్లంగి నవీన్, గంటి ఆకాష్, గొల్లపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.


