రైతుల్లో ఆందోళన
నైరుతి రుతుపవనాల ఆలస్యం, పంట కాలువల ద్వారా నీరు అందించకపోవడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ఎప్పటిలా ఆలస్యం కానుంది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉండడం వల్ల లోటు వర్షమనే అంచనాలు ఖరీఫ్ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
● జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు
● మరోసారి పెరిగిన ఉష్ణోగ్రతలు
● 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు
● కొంపముంచిన అకాల వర్షం
సాక్షి, అమలాపురం: తొలకరి జల్లులతో సేద తీరాల్సిన వేళ.. ఆకాశం నుంచి నిప్పుల వాన కురుస్తున్నట్టుగా కాస్తున్న ఎండలు సామాన్యులను అల్లాడిస్తున్నాయి. రోహిణీ కార్తె కావడంతో ప్రచండ భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. జూన్ 1వ తేదీన కురిసిన అకాల వర్షంతో వాతవరణం చల్లబడుతోందని అనుకుంటే.. తరువాత నుంచి నిప్పులు కురుస్తున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఎండ మండిపోవడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రోడ్లపైకి రావాలంటే జంకు
జిల్లాలో మరోసారి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు నరకం చూస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, 29 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. రోహిణీ ప్రారంభమైన గత నెల 25 నుంచి మొదలై ఎండ వేడి, వడగాడ్పులతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మిట్ట మధ్యాహ్నం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రోడ్డు మీదకు వచ్చేందుకు జనం జడుస్తున్నారు. మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. ఆటోలు, బస్సుల మీద ప్రయాణాలు చేసేవారు సైతం వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కబోత వాతావరణానికి తోడు, ఎడాపెడా విద్యుత్ కోతలతో వారు అల్లాడిపోతున్నారు. అడపాదడపా వర్షం పడినా మరో రెండు, మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగుతాయనే వాతావరణ శాఖ హెచ్చరిక జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ కారణంగా రాత్రి వేళల్లో కూడా వాతావరణం పెద్దగా చల్లబడడం లేదు. వేడిగాలులు, ఉక్కబోత వాతావరణంతో రాత్రులు కూడా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
నైరుతి రాక ఆలస్యం
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రాక ఆలస్యమైంది. తొలుత రుతు పవనాలు మే నెల 26వ తేదీన కేరళను తాకుతాయని, తరువాత వారం రోజుల్లో రాష్ట్రంలోకి వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే చివరి వారానికే నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తొలుత చేసిన ప్రకటనతో ఈ సమయానికి తొలకరి చిరుజల్లులు పడతాయని.. ఉష్ణోగ్రతలు తగ్గుతాయని జనం పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఆలస్యంగా ఈ నెల 5వ తేదీన మాత్రమే నైరుతి కేరళకు వచ్చింది. మరో వారం తరువాత కాని జిల్లాకు వచ్చే అవకాశం లేదు. ఈ ప్రభావం వల్లే ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు గత నెల 25న మొదలైన రోహిణీ కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రోహిణీ ఎండలు మండిపోతున్నాయి.
జాగ్రత్తలు తప్పనిసరి
ఎండలు భారీగా పెరుగుతున్నందున ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఓఆర్‌ఎస్ వంటివి ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు, టోపీ, లేత రంగు కాటన్ దుస్తులను ధరించాలని సూచిస్తున్నారు.
అమలాపురం మండలం కామనగరువు వద్ద నిర్మానుష్యంగా మారిన 216 రహదారి
పట్టని ప్రభుత్వం
గత మే నెల 20వ తేదీ నుంచి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడదెబ్బకు జనం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొందరు చనిపోయారు. అంబాజీపేట మండలంలో ఒక ఆర్‌ఎంపీ వైద్యుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఎండల వల్ల జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నుంచి కనీస చర్యలు లేవు. పీహెచ్‌సీల ద్వారా ఓఆర్‌ఎస్‌లు ఇవ్వడం మినహా గతంలో పెట్టినట్టుగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ వంటివి అందించలేదు. వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినా జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. కేవలం స్వచ్ఛంధ సంస్థలు మాత్రమే ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం.


