రాజమహేంద్రవరం సిటీ: ఎండకు ఎండి.. వానకు తడవాల్సిన దుస్థితి రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్‌లో నెలకొంది. విజయవాడ రైల్వే డివిజన్‌లో విజయవాడ తరువాత రాజమండ్రి అత్యంత ప్రాధాన్యం ఉన్న రైల్వే స్టేషన్. నిత్యం సుమారు 125 ప్రయాణికుల రైళ్లు, 70కి పైగా గూడ్స్ రైళ్లు రాకపోకలు ఈ స్టేషన్ మీదుగా నడుస్తూంటాయి. సుమారు 30 వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ముఖ్యమైన రోజులు, పండగల్లో ప్రయాణికుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఆలయాలను దర్శించేందుకు, పావన గోదావరి తీరంలో పితృకార్యాలు ఆచరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తూంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రాజమండ్రి స్టేషన్‌లో అనేక సమస్యలు తిష్ట వేశాయి. ముఖ్యంగా 4, 5 ప్లాట్‌ఫామ్‌ల పరిస్థితి దారుణంగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు, అసహనానికి గురవుతున్నారు.
ఇవీ సమస్యలు
ఫ రెండేళ్ల కిందటి వరకూ రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో మూడు ప్లాట్‌ఫామ్‌లు మాత్రమే ఉండేవి. రెండేళ్ల క్రితం 4, 5 ప్లాట్‌ఫామ్‌లను ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు నిత్యం 20 రైళ్లు వస్తున్నాయి. అయితే, ‘తాళము వేసితిని.. గొళ్లెము మరచితిని’ అనే చందంగా రైల్వే శాఖ వ్యవహరిస్తూండటం ప్రయాణికులకు ఇక్కట్లను తెచ్చి పెట్టింది. 4, 5 ప్లాట్‌ఫామ్‌లైతే నిర్మించి, ప్రారంభించేశారు కానీ.. వాటిపై కనీస సౌకర్యాలు కల్పించడంపై రైల్వే అధికారులు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు.
ఫ ఈ ప్లాట్‌ఫామ్‌లపై ఈ రెండేళ్లలో ఎక్కడా కనీసంగా కూడా షెల్టర్ ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రయాణికులు ఎండకు ఎండి, వానకు తడవాల్సిన దుస్థితి. ఈ బాధకు తాళలేక కొంత మంది గొడుగు వేసుకుని రక్షణ పొందుతున్న పరిస్థితి.
ఫ రైళ్ల రాక సమయంలో ఏ బోగీ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కడ వస్తుందో ప్రయాణికులకు తెలియజేసే కోచ్ ఎగ్జిబిషన్ (డిస్ల్పే) బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదు. దీంతో, రైలు వచ్చిన తరువాత అది ఆగే రెండు మూడు నిమిషాల్లోనే తమ తమ బోగీల కోసం ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పై ఉరుకులు, పరుగులు తీస్తూ ప్రయాసకు గురవుతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు, భారీ లగేజీతో వస్తున్న వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఫ వారి అగచాట్లు కళ్ల ముందే కనిపిస్తున్నా రైల్వే అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌకర్యాలు లేని ప్లాట్‌ఫామ్‌లపై రైళ్లను నిలపడమెందుకని, షెల్టర్, బోగీ డిస్ల్పే బోర్డుల వంటి సౌకర్యాలున్న మిగిలిన ప్లాట్‌ఫామ్‌లపై ఆపవచ్చు కదా అని పలువురు తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో ఆరో నంబర్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటిస్తున్న అధికారులు.. ఉన్న ప్లాట్‌ఫామ్‌లపై కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తమకు శాపంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ 4, 5 ప్లాట్‌ఫామ్‌లు
ప్రారంభించి రెండేళ్లు
ఫ నిత్యం ఆగుతున్న 20 రైళ్లు
ఫ నేటికీ కానరాని బోగీ డిస్ల్పే బోర్డులు
ఫ రైలు వస్తే తప్పని పరుగులు
ఫ ఇప్పటికీ ఏర్పాటు కాని షెల్టర్లు
ఫ ఎండయినా.. వానయినా గొడుగు పట్టుకోవలసిందే..
ఫ రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇక్కట్లు


