సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీలలో జిల్లాకు చెందినవారికి అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అఫిలెటెడ్ వింగ్ కమ్యూనిటీస్‌లో స్టేట్ బీసీ సెల్ సెక్రటరీగా కామిశెట్టి శ్రీనివాసరావు (అమలాపురం), స్టేట్ వాణిజ్య విభాగం సెక్రటరీగా బొడ్డు నాగేశ్వరరావు (అమలాపురం), రాష్ట్ర వాణిజ్య విభాగం జాయింట్ సెక్రటరీగా పిన్నమనేని వెంకట దుర్గరాజు (అమలాపురం), రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీగా దొమ్మేటి శ్యాంబాబు(అమలాపురం)లను నియమించారు.
ఎమ్మెల్యే సైకిల్ తొక్కడం హాస్యాస్పదం?
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్
సాక్షి, అమలాపురం: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సైకిల్ తొక్కుతూ తద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ అమలాపురం ఎర్ర వంతెన నుంచి సమనస, యానాం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరుతో పెద్ద ఎత్తున చెట్ల నరికివేస్తుంటే అరికట్టడంలో ప్రభుత్వం, ఎమ్మెల్యే విఫలమయ్యారని ఇజ్రాయిల్ విమర్శించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్ల సంరక్షణ, కాలుష్య నియంత్రణ గురించి మాట్లాడటం మాత్రమే కాకుండా, భూమిపై ఉన్న పచ్చదనాన్ని కాపాడేందుకు కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. ఒకవైపు సైకిల్ తొక్కుతూ కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని చెప్పడం, మరోవైపు వేలాది చెట్లు నరికివేస్తున్నా స్పందించకపోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యగా ఆయన అభివర్ణించారు.సమనస, యానాం పరిసర ప్రాంతాల్లో జరిగిన చెట్ల నరికివేతపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని, నరికిన ప్రతి చెట్టుకు ప్రత్యామ్నాయంగా కనీసం పది మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగం బిల్లింగ్ అప్రూవల్ ఇచ్చే ముందు ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలనే నిబంధనను పాటించాలని సూచించారు.
తప్పుడు విద్యార్హతలతో
ప్రమోషనా?
రాజమహేంద్రవరం సిటీ: తప్పుడు విద్యార్హతలతో పదోన్నతి పొందిన ఎలక్ట్రికల్ ఏఈ ఎం.వెంకటేశ్వరరావుపై, ఆయనకు ప్రమోషన్ ఇచ్చిన పబ్లిక్ హెల్త్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏలూరుకు చెందిన రిటైర్డ్ మున్సిపల్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజినీర్ కేవీ సాయిప్రపాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని ఏపీ ప్రభుత్వ ప్రజారోగ్య సాంకేతిక శాఖ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట శుక్రవారం మండుటెండలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మచిలీపట్నం నగర పాలక సంస్థలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో ఎటువంటి అనుమతులూ లేని కళింగ యూనివర్సిటీలో డీఈఈఈ చదివినట్లు తప్పుడు విద్యార్హతలు సృష్టించి, ప్రమోషన్ పొందారని ఆరోపించారు. దీనిపై అన్ని ఆధారాలతో అనేక ఫిర్యాదులు చేసినా అప్పటి అధికారులు పదోన్నతి కల్పించారని ధ్వజమెత్తారు. ఈ విషయమై ప్రధానికి ఫిర్యాదు చేయగా వచ్చిన ఆదేశాలను సైతం ఖాతరు చేయని పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నేటి నుంచి తెలుగు
సాహితీ మహాసభలు
రాజానగరం: వెలుగుబంద సమీపంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ(జీజీయూ)లో రెండు రోజుల పాటు జరిగే ఏడో ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు శనివారం ప్రారంభం కానున్నాయి. చైతన్య సరస్వత పరిషత్ సహకారంతో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యాన ఈ సభలు జరగనున్నాయి. సాహిత్య, సాంస్కృతిక విభాగాలు, రంగస్థల ప్రదర్శనలు, జానపద కళారూపాలు, ప్రాచీన కవుల వారసుల ప్రత్యేక ప్రదర్శనలు వీటిలో ముఖ్య ఆకర్షణలుగా ఉంటాయని నిర్వాహకులు కేవీవీ సత్యనారాయణరాజు, కత్తిమండ ప్రతాప్ తెలిపారు.


