రామచంద్రపురం: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పెరిగిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం పెంచిన జీతాలు కాంట్రాక్టర్ ఇవ్వడం లేదన్నారు. ఈ విషయం అనేకమార్లు కాంట్రాక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లినా సమాధానం ఇవ్వడం లేదన్నారు. జీతాలు అడిగినందుకు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. గతంలో చేసిన డ్యూటీలను మార్చివేశారని, మార్చిన డ్యూటీల వల్ల మహిళలు రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహించాల్సి వస్తోందన్నారు. పెరిగిన జీతాలు ఎరియర్స్‌తో ఇవ్వాలని, పాత పద్ధతిలోనే డ్యూటీలు కొనసాగించాలని, హాస్పిటల్లో పడకలు పెరిగినందువలన వర్కర్స్ ని పెంచాలని, జీతాలు ప్రతినెలా ఏడో తారీఖు లోపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు 14 రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మెలోకి దిగుతామని స్పష్టం చేశారు.


