అమలాపురం రూరల్: ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 1,200 దాటితే నిబంధనల ప్రకారం ఆయా కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణ సిబ్బందితో సమీక్షించారు. అనంతరం రామచంద్రపురం, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాల బీఎల్‌ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసీఐ రూపొందించిన డేటా విశ్లేషణపై టెక్నికల్ అసిస్టెంట్లు బీఎల్‌ఓలు అధ్యయనం చేయాలని ఆదేశించారు. 2002 నాటి డేటాను డౌన్‌లోడ్ చేసుకుని బీఎల్‌ఓ యాప్ మ్యాపింగ్‌పై టెక్నికల్‌గా అధ్యయనం చేయాలన్నారు. బీఎల్‌వోలు, ఈసీఐ యాప్ పోర్టల్ విశ్లేషణ ఓపెన్ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జేసీ వైఖోం నైదియాదేవి ప్రసంగిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేక ముమ్మర సవరణ దశను అధికారికంగా ప్రారంభించిందన్నారు. డీఆర్‌వో సుబ్బారావు, ఈఆర్వోలు జి. మమ్మీ, సరళావతి, జీవీవీ సత్యనారాయణ, డి.రాంబాబు, మున్సిపల్ కమిషనర్లు రాజు,రవి వర్మ, తహసీల్దార్లు, బి.మృత్యుంజయరావు, రవికిరణ్ పాల్గొన్నారు.
14 థియేటర్లు
రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
అమలాపురం రూరల్: జిల్లాలో 14 థియేటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉందని డీఆర్‌వో వీ.సుబ్బారావు తెలిపారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు, రాష్ట్ర తెలుగు డెవలపెమెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ అన్ని జిల్లాల జాయింట్ జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించి ఏపీ సినిమా థియేటర్లలో ఆమోదిత చిత్రాల ప్రదర్శనకు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. డీఆర్‌వో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 14 థియేటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉందని, రిజిస్ట్రేషన్లు చేయించుకునే విధంగా మార్గ నిర్దేశం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆయా థియేటర్లో యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 26 థియేటర్లు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ సూపరింటెండెంట్ రమణకుమారి పాల్గొన్నారు.
పెట్రో ధరలకు నిరసనగా
9న రాస్తారోకోలు
అమలాపురం టౌన్: పెంచిన పెట్రో, వంట గ్యాస్ ధరలకు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించే రాస్తోరోకోలను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు దడాల సుబ్బారావు పిలుపునిచ్చారు. స్థానిక గొల్లగూడెంలో గల జిల్లా ప్రజా సంఘాల కార్యాలయంలో సీపీఐ, సీపీఎంల నాయకులతో గురువారం జరిగిన రాస్తారోకోల సన్నాహాక సమావేశంలో సుబ్బరావు మాట్లాడారు. సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రయోజనాన్ని సామాన్యులకు అందకుండా లీటర్ ఇంధనంపై కేంద్రం రూ.20, రాష్ట్రం రూ.35 చొప్పున భారీగా పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్ర ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు మాట్లాడుతూ. కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయువులో చట్టబద్ధంగా 50 శాతం వాటా రాష్ట్రానికే దక్కాలని డిమాండ్ చేశారు. వామపక్షాల నాయకులు చెల్లుబోయిన తాతారావు, వై.చిట్టిబాబు, పెద్దిరెడ్డి రాము, శీలం వెంకటేష్, జి.దుర్గాప్రసాద్, సఖిలే సూర్యనారాయణ పాల్గొన్నారు.
విజ్ఞాన శిబిరాలతో
నైతిక విలువలు
అమలాపురం టౌన్: గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు నింపుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ (సాయిబాబు రాజు) అన్నారు. జిల్లాలో 67 గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరాలు ఏప్రిల్ 28న మొదలై ఈ నెల 6వ తేదీతో ముగుస్తాయన్నారు. అమలాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో గురువారం జరిగిన శిబిరం ముగింపు సందర్భంగా ప్రసంగించారు. పోటీల్లో విజేతలైన 30 మంది విద్యార్థులకు బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తిని సత్కరించారు.


