జై భీమ్‌రావ్ భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రావణ్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో 2024 ఎన్నికల తరువాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని, 164 సీట్లతో ఒక ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు నిరాశ ఎదురైందని జై భీమ్‌రావ్ భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రావణ్ అన్నారు. గురువారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేసిందో, ఎంత చెడు చేసిందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దళిత క్రైస్తవుల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్న స్పీకర్ రఘురామకృష్ణరాజును తన పదవి నుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత క్రైస్తవులను ఏకం చేసి, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దళిత క్రైస్తవుల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ఈ నెల 28న ఏలూరులో ‘దళిత క్రైస్తవ సమర శంఖారావం‘ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దశాబ్దాలుగా దళిత క్రైస్తవులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వాలు వారి న్యాయమైన డిమాండ్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం కోసం దళిత క్రైస్తవులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.


