మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పలువురు నాయకులు బుధవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, నర్సాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ వడిశెట్టి నారాయణరెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు.
– సాక్షి, అమరావతి
రెండు ఇసుక లారీల సీజ్
సాక్షి కథనం నేపథ్యంలో
స్పందించిన గనులశాఖ
రావులపాలెం: జిల్లాలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై బుధవారం తనిఖీలు చేసి గోపాలపురం హైవేపై రెండు ఇసుక లారీలను సీజ్ చేసి వాటికి రూ. 50 వేలు అపరాధ రుసుం విధించినట్టు గనుల శాఖ ఏడి అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఈ తనిఖీలు నామమాత్రమేనా అన్నట్టుగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలపై బుధవారం ‘సాక్షి’లో ‘అనదికార దందా’ పేరుతో కథనం ప్రచురితం అయిన విషయం తెలిసిందే. అయితే బుధవారం గోపాలపురం హైవేపై గనుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే వందలాది లారీలు నిత్యం హైవే మీద తిరుగుతున్నా వారికి మాత్రం గోపాలపురం వద్ద రెండు లారీలే కనిపించడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనిపై గనుల శాఖ ఏడీని సాక్షి వివరణ కోరగా తమకు వచ్చిన సమాచారంతో వెళ్లి నిఘా పెట్టగా రెండు లారీలను సీజ్ చేశామన్నారు. ఈ లారీలు గోపాలపురం స్టాక్ పాయింట్ నుంచి వస్తున్నాయా? అని సాక్షి ప్రశ్నించగా... గోపాలపురం వశిష్ట గోదావరిలో నుంచి ఇసుకను తీసుకున్న వస్తున్న రెండు లారీలను పట్టుకుని సీజ్ చేశామని ఏడీ అన్నారు.
కొత్తపేట ఆర్డీవోగా
సత్యనారాయణ
కొత్తపేట: స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్‌డీఓ) అండ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా జీవీవీ సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన శ్రీకర్ ఫిబ్రవరి 25న బదిలీ కావడంతో నెల్లూరు జిల్లా రామాయపట్నం పారిశ్రామిక క్లస్టర్ అధికారిగా పనిచేస్తున్న సత్యనారాయణను కొత్తపేట ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం గత నెల 1న ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆయన మంగళవారం అక్కడ రిలీవ్ అయ్యారు.


