అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు డీసీసీబీకి చెల్లించిన షేర్ ధనాన్ని ఆయా సంఘాలు బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పులకు జమ చేయాలని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్రంలోని డీసీసీబీలకు సహకార కమిషనర్ బాబు.ఎ మంగళవారం ఉత్తర్వులు పంపించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సహకార సంఘాలకు డీసీసీబీ బోధిస్తూ పొదుపు సూత్రాలు సూచించింది. సంఘాల్లో సభ్యులైన రైతులు చెల్లిస్తున్న షేరు ధనాన్ని ఎప్పటికప్పుడు డీసీసీబీకి పంపించేస్తున్నామని, ఆ మొత్తాలను డీసీసీబీ నుంచి సంఘాలు తీసుకున్న అప్పులకు జయ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఈనెల 27న ‘సాక్షి’ దిన పత్రికలో ‘బ్యాలెన్స్ చేసేదెలా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి సహకార కమిషనర్ స్పందించి ఈ సమస్య పరిష్కారానికి డీసీసీబీలకు ఉత్తర్వులు జారీ చేశారు. సహకార సంఘాలకు చెందిన షేర్ ధనాన్ని డీసీసీబీలు తక్షణమే ఆ సంఘాలకు జమ చేయాలని కమిషనర్ లిఖిత పూర్వకంగా ఆదేశించారు. దీంతో సహకార సంఘాలు డిమాండ్ చేస్తున్న షేర్ ధనం సమస్య పరిష్కారమైంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 298 సహకార సంఘాల్లో 130 సంఘాలు దాదాపు రూ.400 కోట్ల మేర ఇంబ్యాలెన్స్‌తో ఉన్నాయని ఇటీవల డీసీసీబీ పేర్కొంది. సహకార సంఘాలు డీసీసీబీ నుంచి తీసుకున్న అప్పులు, సంఘాల స్థాయిలో రైతులు తీసుకున్న అప్పుల మధ్య ఇంబ్యాలెన్స్ (అసమతుల్యత) ఏర్పడిందని ఆ బ్యాంక్ ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సహకార సంఘాలు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని డీసీసీబీ సూచించింది. సంఘాల ఇంబ్యాలెన్స్‌కు కారణం తమ దుబాకా ఖర్చులు కాదని, డీసీసీబీ వద్ద సంఘాలకు చెందిన కోట్లాది రూపాయల షేరు ధనాన్ని తమ సంఘాలు బ్యాంక్ నుంచి అప్పలకు జమ చేయకపోవడం వల్లే సంఘాల నష్టపోతున్నాయని సీఈవోలు, త్రీమెన్ కమిటీలు వాదనకు దిగాయి. మొత్తం మీద షేర్ ధనం అదే సంఘాలకు జమ చేసేలా సహకార కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై జిల్లా సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు.
డీసీసీబీలకు సహకార కమిషనర్ ఉత్తర్వులు


