అనదికార దందా | - | Sakshi
Sakshi News home page

అనదికార దందా

Jun 3 2026 12:27 AM | Updated on Jun 3 2026 12:27 AM

గోదావరిలో జూన్‌ 1 నుంచి

అక్టోబర్‌ 15 వరకూ ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు

పాటించని అధికారిక ఇసుక ర్యాంపు నిర్వాహకులు

యథేచ్ఛగా తవ్వకాలు, అమ్మకాలు

అనధికారిక తవ్వకాలు సరేసరి

పట్టించుకోని అధికార యంత్రాంగం

సాక్షి, అమలాపురం/రావులపాలెం: ఒకవైపు అనుమతులు ఉన్న ర్యాంపుల్లో సరిహద్దులు చెరిపి తవ్వకాలు చేస్తున్నారు. మరోవైపు అనధికార ర్యాంపులను ఏర్పాటు చేసి మట్టి, బొండు ఇసుక, ఇసుకను యథేచ్ఛగా తరలించేస్తున్నారు. జిల్లాలో ప్రవహిస్తున్న గౌతమీ, వృద్ధ గౌతమీ, వైనతేయ, వశిష్ట నదీ పాయల వెంబడి ఇస్టానుసారం తవ్వకాలు చేస్తూ గుల్ల చేస్తున్నారు. చివరకు జాతీయ హరిత ట్రిబునల్‌ (నేషనల్‌ గ్రీన్‌ ట్రిబునల్‌) నిబంధనలను సైతం తుంగలో తొక్కి ఇసుక తవ్వకాలు కానిచేస్తున్నారు.

నిబంధనల ప్రకారం..

నదీ గర్భాల్లో జూన్‌ ఒకటి నుంచి అక్టోబర్‌ 15 వరకు అధికారికంగా కూడా ఇసుక, మట్టి, ఇతర తవ్వకాలు చేయకూడదు. గతంలోనే ఎన్‌జీటీ ఈ తీర్పునిచ్చింది. జూన్‌ ఒకటి నుంచి నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూలై 15 తర్వాత గోదావరికి వరద మొదలవుతుంది. తిరిగి అక్టోబరు 15 వరకు అంటే ఈశాన్య రుతుపవనాలు వచ్చే వరకు తవ్వకాల మీద ఎన్‌జీటీ నిషేధం విధించింది. మన జిల్లాలో అక్టోబరు 15 తరువాత ఈశాన్య రుతుపవనాలు రావడం, తర్వాత తుపాన్ల కారణంగా నవంబరు నెలాఖరు వరకు ర్యాంపులను తెరిచే అవకాశం లేదు. అయితే ఎన్‌జీటీ తీర్పును దిక్కరిస్తూ జిల్లాలో అడ్డుగోలుగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి.

అక్రమ తవ్వకాలకు అడ్డే లేదు

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఆత్రేయపురం నుంచి అంతర్వేది తీరం వరకు ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆత్రేయపురం, పి.గన్నవరం, రాజోలు, అయినవిల్లి, ఐ.పోలవరం, కె.గంగవరం, ముమ్మిడివరం మండలాల్లో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. వీటిని నిలువరించాల్సిన మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది. ఇదే అక్రమార్కులకు కలిసి వస్తోంది. కనీసం ఎన్‌జీటీ నిబంధనలు పాటించైనా వీటిని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నా పట్టించుకునే వారే లేరు. అడపాదడపా వర్షాలు పడుతున్నా, వాతావరణ సహకరించడంతో ఇక్కడ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి.

వరదల కోసం

ర్యాంపుదారుల ఎదురు తెన్నులు

గోదావరికి వరదలు వస్తే జిల్లాలోని ఇసుక ర్యాంపులలో తవ్వకాలు దాదాపు నిలిచిపోతాయి. ఈ సమయంలో స్టాక్‌ పాయింట్ల ద్వారా ఇసుక అమ్మకాలు చేస్తారు. ఇది కొంత వరకు ఖర్చుతో కూడుకున్న అంశం. గోదావరి నుంచి స్టాక్‌ పాయింట్‌కు ఇసుక తరలించడం, అక్కడ తిరిగి ఎగమతి చేయడం కొంచెం వ్యయప్రయాసలతో కూడుకున్న అంశం. అదే గోదావరిలోనే నేరుగా ఎగుమతి చేస్తే ర్యాంపు నిర్వాహకులకు ఎక్కువగా సొమ్ములు మిగులుతాయి. అయినా కూడా ర్యాంపు నిర్వాహకులు ఈ ఏడాది తొందరగా వరదలు రావాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు కారణం గోదావరి పొడవునా అక్రమంగా చేస్తున్న తవ్వకాలు నిలిచిపోతాయని. ప్రస్తుతం ఈ తవ్వకాల వల్ల ర్యాంపులలో ఇసుకకు డిమాండ్‌ లేకుండా పోతోంది. అలాగే గత ఏడాది పెద్ద ఎత్తున స్టాక్‌ పాయింట్లలో ఇసుక నిల్వ ఉంచినా అమ్మకాలు సాగలేదు. పోనీ మైనింగ్‌, ఇతర అధికారులతో కలిసి అనధికార తవ్వకాలను అడ్డుకుందామన్నా వాటి వెనుక ఆయా నియోజకవర్గాలకు చెందిన కీలక ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది.

పేరుకే ఉచితం

ఉచిత ఇసుక విధానమని ప్రభుత్వం చెబుతున్నా ర్యాంపుల వద్ద ఇసుక ఖరీదైన వ్యవహారంగా మారింది. బాట చార్జీలు, ఇసుక లోడింగ్‌ చార్జీలు, పర్యావరణ అనుమతులు, జీఎస్టీ పేరుతో టన్నుకు రూ.132 వరకు వసూలు చేస్తున్నారు. ఒక లారీ అంటే సుమారు 20 టన్నుల ఇసుకకు రూ.2,640 అవుతోంది. దీనికి రవాణా చార్జీలు అధికం. అయితే అక్రమార్కులకు వద్ద ఇవన్నీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ర్యాంపులన్నీ కొత్తపేట, మండపేట నియోజకవర్గంలో ఉన్నాయి. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం, రాజోలుకు రవాణా చార్జీలు అధికం. అదే గోదావరి పొడవునా తవ్వకాలు చేస్తే ఇసుక రవాణా ఖర్చులు కూడా కలిసి రావడంతో అక్రమార్కుల వద్దనే ఇసుక అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

జిల్లాలో ర్యాంపులు

జిల్లాలో మొత్తం 12 అధికారికంగా ఇసుక ర్యాంపులున్నాయి. ప్రస్తుతం ఆలమూరు మండలం జొన్నాడ, ఆలమూరు, ఆత్రేయపురం మండలం మెర్లపాలెం (ఊబలంక సరిహద్దు), కపిలేశ్వరపురంలో అధికారిక ర్యాంపులున్నాయి. వీటిల్లో ఈ ఏడాది డిసెంబరు 9 వరకు ఇసుక తవ్వకాలకు అనుమతులున్నాయి. అయినా సరే ఎన్‌జీటీ ఆదేశాలను అనుసరించి జూన్‌ 1వ తేదీ అంటే సోమవారం నాటికే వీటిని మూసివేయాల్సి ఉంది. కానీ ఈ నాలుగు ర్యాంపుల వద్ద కూడా ఇసుక తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement