కూ.. చిక్కుచిక్‌ | - | Sakshi
Sakshi News home page

కూ.. చిక్కుచిక్‌

Jun 3 2026 12:27 AM | Updated on Jun 3 2026 12:27 AM

కోనసీమ రైల్వే లైన్‌కు అనేక చిక్కులు

ఎట్టకేలకు కొత్త ఎలైన్‌మెంట్‌ ఖరారు

పరిహారం చెల్లించకపోవడంతో ప్రజల అసంతృప్తి

మలికిపురం: దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కృషితో తెరపైకి వచ్చిన కోనసీమ రైల్వే లైన్‌ ప్రాజెక్టు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారింది. ట్రాక్‌ ఎలైన్‌మెంట్లు వేయడం, వాటిని మార్చడంతోనే సరిపోతోంది. ఎట్టకేలకు కొత్త ఎలైన్‌మెంట్‌ ఖరారైనా పరిహారం చెల్లించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో రాజోలు దీవిలోనే కొనసీమ రైలు తిరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. దిండిలో గతంలో సేకరించిన రైల్వే లైన్‌ మార్గంలో 20 ఏళ్ల క్రితం ఏపీటీడీసీ టూరిజం కేంద్ర భవనాలు నిర్మాణమయ్యాయి. అంతే కాక కొత్త కాలనీ, పాత కాలనీలు ఉన్నాయి. స్థానికుల నుంచి విన్నపాలు రావడంతో అప్పటి కలెక్టర్‌ ఎలైన్‌మెంట్‌ మార్పునకు అంగీకరిస్తూ కొత్త లైన్‌ సర్వే కోసం ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం వశిష్ట నదిపై ఉన్న దిండి – చించినాడ వంతెనకు తూర్పున ఒక లైన్‌, పశ్చిమాన మరో రెండు లైన్లు సర్వే చేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలను అప్పట్లో రూపొందించారు. అయితే స్థానికుల నుంచి అభ్యంతరాలు రావడంతో పాటు శివకోడు నుంచి లైన్‌ మార్చాల్సి ఉండడం, నదిపై వంతెన నిర్మాణం, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని కొత్త లైన్‌ ఏర్పాటు చేయాల్సి ఉండడంతో అధికారులు గట్టి కసరత్తే చేశారు. ఇటువంటి పరిస్థితులలో గత కొన్ని సంవత్సరాలుగా కోనసీమ రైలు రాజోలు దీవిలోనే తిరుగుతోంది.

ఎట్టకేలకు సుగమం

ఎట్టకేలకు రెండు నెలల క్రితం దిండి వంతెనకు తూర్పు వైపు నుంచి కంటే పశ్చిమ వైపు నుంచే రైలు మార్గం ఫైనల్‌ అయింది. రైల్వే లైన్‌ను పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పాలకొల్లుకు కాకుండా నర్సాపురం స్టేషన్‌కు మాత్రమే అనుసంధానం చేయాల్సి ఉన్నందున నర్సాపురానికి దగ్గరి మార్గమైన రామరాజులంక – ఏనుగువానిలంక మధ్య వశిష్ట నది మీదుగా రైల్వే లైన్‌ వేసేలా కొత్త ఎలైన్‌మెంట్‌ రూపొందించారు. రామరాజులంక మీదుగా దిండిలో వశిష్ట నదిని దాటి కొత్త లైన్‌ కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రామరాజులంక, గుడిమెళ్లంక పంచాయతీ, మట్టపర్రు, చింతలపల్లి, కడలి మీదుగా పాశర్లపూడి వైపు కొత్త ఎలైన్‌మెంట్‌ తయారు చేశారు. అయితే ఈ ఎలైన్‌మెంట్‌లో కూడా గుడిమెళ్లంక గ్రామస్తులు కోర్టులకు వెళ్లడంతో కాస్త ఆలస్యం అయినా ఎట్టకేలకు కోర్టు నుంచి క్లియరెన్స్‌ రావడంతో ఈ ఎలైన్‌మెంట్‌నే ఖరారు చేశారు.

రైల్వే లైన్‌ ఏర్పాటులో అలసత్వం

కోనసీమ రైల్వే లైన్‌ ఏర్పాటులో కూటమి సర్కారు తీవ్ర అలసత్వం వహిస్తోంది. ఫలితంగా భూసేకరణకు పరిహారం ఇవ్వలేదు. ట్రాక్‌ పనులు ప్రారంభం కావడంలేదు. ఇలా అయితే ఎన్ని అలైన్‌మెంట్లు వేస్తారో అర్థం కావడం లేదు.

– దివ్వి చిట్టిబాబు, అప్పనరామునిలంక

పరిహారం మాటేమిటి!

కొత్త ఎలైన్‌మెంట్‌ ప్రకారం రాజోలు దీవిలో తాటిపాక, గెద్దాడ మధ్య కాకుండా కడలి సమీపంలో రైల్వే స్టేషన్‌ ఏర్పాటవుతుంది. ఇక మలికిపురం మండలంలో మరో రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేస్తారు. కొత్త లైన్‌ ఏర్పాటును బట్టి ఈ అవకాశం ఉంటుంది. కొత్త ఎలైన్‌మెంట్‌కు భూ సేకరణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. పరిహారం మాత్రం చెల్లించలేదు. దిండిలో వంతెన నిర్మాణం చేపట్టిన ప్రాంత రైతులకు మాత్రమే పరిహారం అందించారు. కోనసీమ రైల్వే లైన్‌ ఏర్పాటులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపక పోవడం వల్ల మరింత ఆలస్య అయ్యే పరిస్థితి నెలకొంది. అలైన్‌మెంట్‌ ఖరారు అయినా పరిహారం ఇవ్వక పోవడం, ట్రాక్‌ పనులకు నిధులు ఇవ్వక పోవడంతో ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement