విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం రూ.34.80 లక్షలు | - | Sakshi
Sakshi News home page

విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం రూ.34.80 లక్షలు

Jun 3 2026 12:27 AM | Updated on Jun 3 2026 12:27 AM

అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం అమలాపురం దేవదాయశాఖ, ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో లెక్కించారు. 69 రోజులకు రూ.34,80,870 లభించిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఇంకా 1.8 గ్రాముల బంగారం, 49.2 గ్రాముల వెండి, 25 విదేశీనోట్లు లభించాయని తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

గోదావరిలో పడి వ్యక్తి మృతి

ఐ.పోలవరం: బహిర్భూమి కోసం గోదావరి ఒడ్డుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందాడు. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముమ్మిడివరం మండలం తెల్లవారిపాలేనికి చెందిన వేగిరావతి వెంకటేశ్వరరావు (43) ముమ్మిడివరంలో శ్రీ సాయి చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ముమ్మిడివరం నుంచి యానాం వైపు వెళుతూ బహిర్భుమి కోసం ఎదుర్లంక వద్ద గోదావరి గట్టుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ కాలు జారి గోదావరిలో పడిపోయాడు. చూసిన స్థానికులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై ఎస్సై రవీంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధి పనులకు వచ్చి కూలీల మృతి

కొత్తపేట/కాజులూరు: ఉపాధి పనులకు వచ్చిన కూలీలు పని ప్రదేశంలోనే మృతి చెందారు. వేర్వేరు గ్రామాల్లో జరిగిన ఈ ఘటనల వివరాలు..కొత్తపేట మండల పరిధిలోని గంటి గ్రామానికి చెందిన చామకూరి హనుమంతరావు (75) అనే ఉపాధి కూలీ.. డ్రైన్‌ పూడికతీత పనికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. ఏపీఓ ఎన్‌.ఆనంద్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గంటిలోని వరాల నాగమ్మ తల్లి ఆలయం రోడ్డు వెంబడి డ్రైన్‌ పూడికతీత పని చేపట్టారు. మంగళవారం ఉదయం 52 మంది ఉపాధి కూలీలు ఆ పనికి వెళ్లగా, ఫొటో తీసుకునే సమయంలో చామ కూరి హనుమంతరావు హఠాత్తుగా గుండెపోటు తో కుప్పకూలాడు. వెంటనే ఉపాధి సిబ్బంది, సహచరులు వైద్య సిబ్బందిని తీసుకువచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాలువ తవ్వకం పనులు చేస్తూ..

కాజులూరు మండలం తిప్పరాజుపాలెంలో కాలువ తవ్వకం పనిచేస్తున్న ఉపాధి కూలీ మేడిశెట్టి రాఘవ మృతి చెందింది. ఆమె తన తోటి కూలీలతో కలసి మంగళవారం ఉదయం గ్రామ శివార్లలోని డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌లో పనికి వెళ్లింది. పనిచేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆమె అంబులెన్సులో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఉపాధి ఏపీవో బి.వెంకటలక్ష్మి, వీఆర్వో వరలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పరామర్శించారు.

జోసా కౌన్సెలింగ్‌పై అవగాహన

రాజమహేంద్రవరం రూరల్‌: కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో మంగళవారం జరిగిన జోసా/సి–శాబ్‌ కౌన్సెలింగ్‌ 2026 అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌కు సుమారు 4000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, బీఐటీఎస్‌ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో తమ రాజమహేంద్రవరం క్యాంపస్‌ నుంచి 780 మంది విద్యార్థులు అడ్మిషన్లు సాధించగలరన్నారు. జోసా కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఎలా పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్‌లలో సీట్లు వస్తాయో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్‌ వి.శ్రీహరి, తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీ డీన్‌ డాక్టర్‌ వీరేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement