ఫ రాజ్యసభ సభ్యుడు బోస్
ఫ అమలాపురంలో ముగిసిన బాస్కెట్ బాల్ శిక్షణ
అమలాపురం టౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, అప్పుడే మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. జాతీయ బాస్కెట్ బాల్ మాజీ క్రీడాకారుడు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా స్థలంలో నెల రోజులుగా జరుగుతున్న బాస్కెట్ బాల్ వేసవి శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు బోస్‌తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ అతిథులుగా పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. అమలాపురం కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే ఐపీఎస్ మెమోరియల్ జిమ్, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మే 1న ఈ శిక్షణ ప్రారంభమైన విషయం తెలిసిందే.
అభినందనీయం
జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ ఏటా వేసవిలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు క్రమం తప్పకుండా బాస్కెట్ బాల్ క్రీడలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. మాజీ ఎంపీ అనురాధ మాట్లాడుతూ క్రీడల విలువ తెలిసిన ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అదే స్ఫూర్తితో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని రాష్ట్ర, జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు రేపటి క్రీడాకారులు కావాలన్నది తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. కోచ్ ఆకుల ఉమ, వ్యాయాయ ఉపాధ్యాయులు కుడుపూడి బుజ్జి, వెంకట్రావు మాట్లాడుతూ రోజూ వంద మందికి తక్కువ కాకుండా విద్యార్థులు బాస్కెట్ బాల్ క్రీడలో తర్ఫీదు పొందారని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సూదా గణపతి, క్లబ్ మాజీ అధ్యక్షుడు రవణం వేణుగోపాలరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భమిడిపాటి రామకృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డగళ్ల సాయిరామ్, ముంగర ప్రసాద్, మోటూరి సత్యంకాపు, నక్కా చంద్రశేఖర్, దోనిపాటి లోవరాజు పాల్గొన్నారు.


