అమలాపురం టౌన్: స్థానిక నల్ల వంతెన సమీపంలోని వుమెన్ కేర్ జనరల్ ఆస్పత్రిలో గత నెల 26న ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ విద్యార్థినికి అబార్షన్ చేసిన ఘటనపై విచారణ కమిటీ అధికారులు మంగళవారం అదే ఆస్పత్రిలో విచారణ నిర్వహించారు. అమలాపురం ఇన్‌చార్జి ఆర్డీవో జి.మమ్మీ, డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కార్తిక్, జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.నాగమణి, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు డాక్టర్ కె.నాగ మానస, అడిషనల్ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ భరతలక్ష్మితో కూడిన విచారణ కమిటీ ఆస్పత్రి సిబ్బందిని లోతుగా విచారించింది. విద్యార్థినికి నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ జరిగిన ఘటనపై కలెక్టర్ ఆర్.మహేష్ కుమా ర్ విచారణ కమిటీని నియమించి, తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాలపై విచారణ కమిటీలోని అధికారులు ఆస్పత్రిని సందర్శించి విచారణ మొదలుపెట్టారు. తొలుత ఆస్పత్రి వైద్యురాలు, పి.గన్నవరం ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఎల్.శిరీషను, తర్వాత ఇతర వైద్యులు, నర్సులు, సిబ్బందిని వేర్వరుగా విచారణ చేశారు. వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. కమిటీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆస్పత్రి వైద్యులు, నర్సులు నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఆస్పత్రి స్టాఫ్ నర్సు వైద్యం చేసిందని, ఇందులో తమకు సంబంధం లేదని వైద్యురాలు తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. అనంతరం ఆర్డీవో మమ్మీ, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ దుర్గారావు దొర ఆస్పత్రిలో విలేకర్లతో మాట్లాడుతూ ఇంకా కొందర్ని విచారణ చేయాల్సి ఉందని, మొత్తం పూర్తయ్యాక నివేదికను కలెక్టర్ మహేష్ కుమార్‌కు అందజేస్తామని చెప్పారు. బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు డాక్టర్ నాగ మానస మాట్లాడుతూ తమ రాష్ట్ర కమిషన్ నుంచి కూడా త్వరలో ప్రతినిధులు అమలాపురంలోని ఆస్పత్రికి వచ్చి విచారించనున్నార ని చెప్పారు. అలాగే వుమెన్ కేర్ జనరల్ ఆస్పత్రి వైద్యురాలైన డాక్టర్ శిరీష పనిచేస్తున్న పి.గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా మంగళవారం సాయంత్రం నుంచి కమిటీ అధికారులు విచారణ చేశారు.


