అమలాపురం టౌన్: తమకు 12 నెలల జీతం ఇప్పించాలని కోరుతూ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు కోనసీమకు చెందిన 98 ఎంటీఎస్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి కేశవ కుమార్ ఆధ్వర్యంలో టీచర్లు సోమవారం వినతి పత్రం అందించారు. అలాగే తమ సర్వీ స్‌ను తక్షణమే 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. జీవోఎం ఇచ్చిన రూల్స్ ప్రకారం తమకు అన్ని అర్హతలు ఉన్నాయని సీఎంకు గుర్తు చేశారు. అలాగే ఆదివారం అమలాపురం మున్సిపాలిటీ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి.నారాయణకు ఇదే డిమాండ్లపై రాష్ట్ర ఫెడరేషన్ బృందం వినతి పత్రం ఇచ్చింది.
పోలీస్ గ్రీవెన్స్‌కు 24 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 24 అర్జీలు వచ్చాయి. ఎస్పీగా పదోన్నతి పొందిన జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ ఈ గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు ఫిర్యాదులు అందించారు. వారితో ఏఎస్పీ ప్రసాద్ ముఖాముఖి మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లలో మాట్లాడారు.
అక్రమంగా
ఆక్వా చెరువుల తవ్వకం
అమలాపురం రూరల్: మండలంలోని నడిపూడి బండారులంక, నడిపూడి వెళ్లే లింకు రోడ్డుకు ఆనుకుని పంట కాలువ వద్ద అక్రమంగా ఆక్వా చెరువులను తవ్వుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల మధ్య ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారన్నారు. వీటి వల్ల బండారులంకలో కొత్తగా ఏర్పడిన జాతీయ రహదారి, రహదారి వెంబడి ఉన్న నివాసాలు, పంట పొలాలకు నష్టం జరుగతుందన్నారు. రెండు పంటలు పండే వరి చేలలో రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారని బండారులంక, గంగలకుర్రు అగ్రహారానికి చెందిన రైతులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉప్పుగంటి భాస్కరరావు మాట్లాడుతూ వ్యవసాయ భూములతో పాటు సమీపంలోని వంద ఎకరాల కొబ్బరి తోటలు, వాటిలో అంతర పంటలుగా సాగు చేస్తున్న అరటి, పోక, కోకో నాశనం అవుతాయన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.


