అమలాపురం రూరల్: మలికిపురం మండలం లక్కవరంలో ఉప్పునీటి రొయ్యల చెరువుల అక్రమ సాగుతో వ్యవసాయ భూములు.. బీడుగా మారిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆ చెరువుల వ్యర్థాల కారణంగా 80 ఎకరాల్లో భూములు నాశనమయ్యాయని, కొబ్బరి చెట్లు వెర్రి తలలు వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల వేదిక నాయకులు ఏడిద రాజేష్, ముత్యాల శ్రీనివాసరావు, ఎ.రవి మాట్లాడుతూ రొయ్యల చెరువుల కారణంగా వ్యవసాయం చేసే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. లక్కవరంలో ముదునూరి విష్ణుమూర్తి రాజు, ముదునూరి శ్రీనివాసరాజు పది ఎకరాలు ఎకరాల సారవంతమైన భూములను అక్రమ ఉప్పు నీటి రొయ్యల చెరువులుగా మార్చివేశారని ఆరోపించారు. ఆ చెరువులను తొలగించాలని కలెక్టర్ మహేష్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.


