చీకట్‌లతో వెతలు | - | Sakshi
Sakshi News home page

చీకట్‌లతో వెతలు

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

వేళాపాళా లేకుండా విద్యుత్‌ కోతలు

ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి

సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు

అమలాపురం రూరల్‌: మండే వేసవి ఎండలకు తోడు వేళాపాళా లేకుండా విద్యుత్‌ శాఖ విధిస్తున్న కోతల వల్ల ప్రజలు అల్లాడి పోతున్నారు. గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు పెరగడంతో జనం రాత్రి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉష్ణోగ్రతలతో పాటు పెరిగిన విద్యుత్తు వినియోగం

జిల్లాలో మే 20 తేదీ నుంచి 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో విద్యుత్‌ వాడకం భారీగా పెరిగిపోయింది. సాధారణంగా మే నెలలో విద్యుత్‌ వాడకం అధికంగా ఉంటుంది. 2025 మే 14న జిల్లాలో 5.656 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ వాడారు. ఈ ఏడాది మే 25న రికార్లు స్థాయిలో 7.444 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ వాడేశారు.

జనం ఆగ్రహం

ఇటీవల కామనగరువు మెట్ల సత్యనారాయణ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయక పోవడంతో కాలనీవాసులు ఽసబ్‌స్టేషన్‌ ముట్టడించి ధర్నా చేశారు. అమలాపురం రూరల్‌, అల్లవరం, పి.గన్నవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో సబ్‌ స్టేషన్లు వద్ద ధర్నాలు చేయడంతో అధికారులు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

పొదుపు చర్యలు పాటించాలి

అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. విద్యుత్‌ వాడకం పెరిగి ట్రాన్ప్‌ఫార్మర్ల తరచూ ట్రిప్‌ అవుతున్నాయి. దీనివల్లే విద్యుత్‌ అంతరాయాలు జరుగుతున్నాయి. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి. విద్యుత్‌ వచ్చిన వెంటనే ఏసీలు, గృహ పరికరాలు వెంటనే ఆన్‌ చేయకుండా అరగంట ఆగాలి. దీనివల్ల ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి తగ్గి విద్యుత్‌ అంతరాయాలు ఉండవు.

– బి.రాజేశ్వరి, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్‌

కాలిపోయిన 63 ట్రాన్స్‌ ఫార్మర్లు

జిల్లా వ్యాప్తంగా 26 వేల ట్రాన్‌ఫార్మర్లు ఉండగా 63 కాలిపోయాయి. 28 గాలులకు ధ్వంసం అయ్యాయి. వాటి స్థానే కొత్తవి ఏర్పాటు చేశారు. వర్షాలు, ఈదురు గాలులు, తుపాన్‌, వరదల సమయంలో మాత్రమే విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ ఫార్మర్లు ధ్వంసం అవుతూ ఉంటాయి. కాని తొలిసారిగా జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు విద్యుత్‌ వాడకం పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. విద్యుత్‌ నిలిచిపోయి కొంత సమయానికి వచ్చిన వెంటనే ఏసీలు, ఫ్యాన్లు కూలర్లు, మోటార్లు అందరూ ఒకేసారి ఆన్‌ చేయడం వల్ల ఓవర్‌ లోడ్‌కు ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరిగి కాలిపోతున్నాయి. జిల్లాలో కొబ్బరి ఆకులు విద్యుత్‌ లైన్లపై పడి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో గ్రామాల్లో వందలాది ఇన్స్‌లేటర్లు కాలిపోయి ఫీడర్లు ట్రిప్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement