నేడూ విద్యుత్‌ బిల్లులు చెల్లించొచ్చు | - | Sakshi
Sakshi News home page

నేడూ విద్యుత్‌ బిల్లులు చెల్లించొచ్చు

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలో అన్ని విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాల్లో ఆదివారం విద్యుత్‌ బిల్లులు చెల్లించొచ్చని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎస్‌.రాజేశ్వరి తెలిపారు. అదే విధంగా సెక్షన్‌ ఆఫీస్‌ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు కూడా పనిచేస్తాయన్నారు. జిల్లాలో విద్యుత్‌ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, విద్యుత్‌ బిల్లులను సకాలంలో చెల్లించాలని కోరారు.

ఎకరాకు రూ.కోటి చొప్పున

నష్టపరిహారం

అమలాపురం రూరల్‌: 216 జాతీయ రహదారి వెంబడి విద్యుత్‌ టవర్లు ఎత్తు పెంచి పునర్నిర్మించడానికి భూములు ఇచ్చిన యజమానులకు ప్రభుత్వ ధర కంటే 200 శాతం పరిహారం పెంచి ఎకరాకు రూ.కోటి చొప్పున (సెంటు భూమి ఖరీదుగా నిర్ణయించి) ఇవ్వనున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వైఖోం నైదియాదేవి తెలిపారు. ఆమె అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, జాతీయ రహదారులు, ట్రాన్స్‌కో అధికారులు, భూములు ఇచ్చిన యజమానులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 216 జాతీయ రహదారి వెంబడి రాజోలు, మామిడికుదురు మండలాల్లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ లైన్లను పునర్నిర్మించేందుకు యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోందన్నారు.

జేవీవీ శిక్షణ తరగతులు

ప్రారంభం

అమలాపురం టౌన్‌: అమలాపురంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగే జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర స్థాయి తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేవీవీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ చల్లా రవికుమార్‌ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 38 ఏళ్లుగా జేవీవీ అనేక సేవలు, కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. శిక్షణకు మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు జనుపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ తరగతులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరైన 150 మందికి పైగా ప్రతినిధులకు జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీవీ వర ప్రసాద్‌ స్వాగతం పలికారు. జిల్లా గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఈఆర్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జేవీవీ లక్ష్యాలను, ఇప్పటి వరకూ నిర్వహించిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలను వివరించారు. అనంతరం ‘శాసీ్త్రయ సమాజ నిర్మాణ కోసం జేవీవీలో భాగస్వామ్యం కండి’ అనే పోస్టర్లను ఆవిష్కరించారు.

గోదావరి డెల్టాకు

నేటి నుంచి సాగునీరు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఖరీఫ్‌ సాగు నిమిత్తం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి కాలువలకు ఆదివారం నుంచి నీరు విడుదల చేయాలని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది. కాలువల మరమ్మతుల పరిస్థితిని బట్టి దశల వారీగా నీరు విడుదల చేయనున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్ల మరమ్మతులు, బ్యారేజీ పరిరక్షణ చర్యలకు సుమారు రూ.148 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఖరీఫ్‌లో సాగునీటి కొరత తలెత్తే పరిస్థితి ఉండదని చెప్పారు. అక్టోబర్‌ 31వ తేదీ వరకూ సాగు, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పవన్‌ వైఖరి ప్రచారార్భాటమే..

రాజమహేంద్రవరం సిటీ: పేపర్‌ మిల్లు రసాయన వ్యర్థాల నుంచి గోదావరి జలాలను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వైఖరి ఒట్టి ప్రచారార్భాటమేనని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ, గోదావరిని ప్రక్షాళన చేస్తానన్న పవన్‌ కల్యాణ్‌.. రాజమహేంద్రవరం దాటిన వెంటనే మాట మార్చారన్నారు. 262 పంచాయతీలను మురుగు రహితంగా తీర్చిదిద్దాలనడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. పేపర్‌ మిల్లు తెరచి ఉండగా కాలుష్య రహిత పుష్కరాలు సాధ్యమేనా అనే విషయం పవన్‌కు అర్థం కాలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement