అమలాపురం టౌన్: జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగించారని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి (డీఐఈవో) కె.చంద్రశేఖర్‌బాబు తెలిపారు. ఈ మేరకు అమలాపురంలో శనివారం ప్రకటన విడుదల చేశారు. సెలవుల పొడిగింపుపై ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశాలు ఇచ్చారన్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఆ తేదీని జూన్ 6కు మార్పు (వాయిదా) చేసినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీ వరకూ జరుగుతున్న క్రమంలో ఈ మార్పు చేశారని స్పష్టం చేశారు. జూన్ 6వ తేదీన కళాశాలల పునఃప్రారంభానికి ఆయా ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు సిద్ధం కావాలని సూచించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన మిగతా కార్యక్రమాల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.
తొమ్మిది ప్రైవేట్ బస్సులపై కేసు
రావులపాలెం: నిబంధనలను ఉల్లంఘించిన తొమ్మిది ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.22,800 అపరాధ రుసుము విధించినట్టు జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ ఈతకోట టోల్ ప్లాజా వద్ద 32 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారన్నారు. అతి వేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరంతరం ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, జ్యోతి, సురేష్ కుమార్, షణ్ముఖ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


