కూరగాయలకు ఎండ దెబ్బ | - | Sakshi
Sakshi News home page

కూరగాయలకు ఎండ దెబ్బ

May 31 2026 12:18 AM | Updated on May 31 2026 12:18 AM

ఆలమూరు: ఈ వేసవిలో నమోదైన అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయల తోటలతో పాటు వాణిజ్య పంటలైన అరటి, మొక్కజొన్న, కందలపై పడింది. మొక్కలు ఎండిపోవడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. అలాగే ఉత్పత్తుల్లో నాణ్యత లోపించడంతో పాటు దిగుబడి బాగా తగ్గిపోయింది. జిల్లాలోని 19 మండలాల్లో 1.23 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తుండగా, వాటిలో 4,805 ఎకరాల్లో కూరగాయాల తోటలు ఉన్నాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఫ ఉదయం, సాయంత్రం తోటలకు సాగునీరు అందించాలి. డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతి పాటిస్తే మేలు.

ఫ పొలంలో ఎండిన గడ్డి, వరి గడ్డి, ప్లాస్టిక్‌ మల్చింగ్‌ వేయాలి. దీని వల్ల నేలలో తేమ ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది.

ఫ షేడ్‌ నెట్‌ను 35 నుంచి 50 శాతం మధ్య ఏర్పాటు చేస్తే అధిక ఉష్ణోగ్రత ప్రభావం తగ్గుతుంది.

ఫ మొక్కల చుట్టూ కలుపును తొలగించాలి. ఎండ తీవ్రత లేని సమయంలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి.

ఫ పొటాషియం నైట్రేట్‌ (కేఎన్‌ఓ3) ఒక శాతం లేదా 13:00:45 ద్రావణాన్ని పిచికారీ చేస్తే చక్కని ఫలితాలు ఆశించవచ్చు.

ఫ నిర్ణీత సమయంలో పొటాష్‌ ఇవ్వడం వల్ల మొక్కలకు ఉష్ణ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.

ఫ వేసవి తీవ్రతతో టమాటా, మిర్చి, బెండ, దోసకాయ, కాకర వంటి పంటల్లో పుష్పాలు రాలే అవకాశం ఉన్నందున తోటల్లో తేమను స్థిరంగా ఉంచాలి.

తీగ జాతి రకాలు లాభదాయకం

వేసవిలో తరచూ పెరిగే ఉష్ణోగ్రతలకు అనుగుణంగా కూరగాయల సాగులో ఉద్యాన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలను ఎల్లప్పుడూ సంరక్షించుకుంటూ ఉండాలి. వేసవిలో అనుకూలమైన తీగజాతి రకాలను సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది.

– డీవీ రమణ, జిల్లా ఉద్యానశాఖ అధికారి

ఫ తోటలకు సక్రమంగా అందని నీరు

ఫ నాణ్యత, దిగుబడి తగ్గిపోయిన వైనం

పందిరి సాగు లాభదాయకం

వేసవిలో పందిరి సాగు మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీగ జాతి కూరగాయలైన దోస, బీర, కాకర, సొర, దొండ, పొట్లకాయ వంటి రకాలను సాగు చేస్తే దిగుబడి ఆశాజనకంగా ఉంటుందన్నారు. ఇవి నేలను తాకకుండా ఎండ వేడిమి నుంచి రక్షణ పొందుతాయని, అలాగే పూల తోటల్లో కూడా తీగ జాతి మొక్కలు సాగు చేస్తే చక్కని ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement