రక్తహీనత ఉన్న విద్యార్థినికి అబార్షనా? | - | Sakshi
Sakshi News home page

రక్తహీనత ఉన్న విద్యార్థినికి అబార్షనా?

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

విచారణలో వెలుగు చూస్తున్న ఉమెన్‌ కేర్‌ ఆస్పత్రి తప్పిదాలు

నిందితులపై పోలీస్‌ కేసులు పెట్టలేదని ఎస్పీకి ప్రజా సంఘాల ఫిర్యాదు

వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

అమలాపురం టౌన్‌: రక్తహీనత (హిమోగ్లోబిన్‌) 12 గ్రాములు ఉండాల్సిన విద్యార్థినికి కేవలం 6.8 గ్రాములు ఉండగా ఆమెకు అబార్షిన్‌ ఎలా చేశారని విచారణాధికారులు వైద్యులను ప్రశ్నిస్తున్నారు. అమలాపురం నల్లవంతెన సమీపంలో గల వుమెన్‌ కేర్‌ అండ్‌ జనరల్‌ ఆస్పత్రిలో ఓ బాలికకు అబార్షన్‌ చేసిన వైద్యులను విచారణాధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు వారి నుంచి సమాధానాలు కరవయ్యాయి. ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ శిరీషను బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు నాగ మానస, డీఎంహెచ్‌వో డాక్టర్‌ దుర్గారావు దొర వేర్వేరుగా విచారించినప్పుడు రక్తహీనత ఉన్న విద్యార్థినికి మీరెలా అబార్షన్‌ చేశారని పదే పదే అడిగారు. రక్త హీనతకే తాము వైద్యం చేశామని, అబార్షన్‌కు కాదని ఆస్పత్రి వైద్యులు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలైన విద్యార్థినిని, వారి తల్లిదండ్రులను విచారణాధికారులు అడిగినప్పుడు అబార్షన్‌ చేశారని చెప్పడం గమార్హం. గర్భం పోవడానికి ముందుగా రెండు టాబ్లెట్లు ఇచ్చారని, అవి వేసుకున్నప్పటి నుంచి తనకు విపరీతమైన నొప్పి వస్తోందని బాధితురాలు గగ్గోలు పెట్టింది.

రాజకీయ అండ ప్రభావం చూపుతోందా?

ఈ దారుణ ఘటనపై కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ విచారణ కమిటీని నియమించి ఆస్పత్రి వైద్యులు, బాధితురాలు, వారి కుటుంబీకులను విచారించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అనుచరుడొకరు ఈ వ్యవహారంలో మొత్తం చక్రం తిప్పాడని బాధితుల మాటలను బట్టి తెలుస్తోంది. విద్యార్థిని ప్రియుడు, అతని స్నేహితులకు గర్భం దాల్చిన బాలికను అమలాపురం తీసుకుని వెళ్లి అబార్షన్‌ చేయించమని చెప్పింది అతడే. పి.గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలికి అబార్షన్‌ చేయాలని సూచించిందీ అతడే. అమలాపురంలోని ఆ వైద్యురాలికి చెందిన ప్రైవేటు ఆస్పత్రిలో విద్యార్థిని చేర్చి, అబార్షన్‌ చేయించే ఏర్పాట్లు చేయించిందీ అతడే. బాధ్యులపై ఇప్పటి వరకూ కేసులు నమోదు కాకపోవడానికి, పి.గన్నవరం ప్రభుత్వ, అమలాపురం ప్రైవేటు ఆస్పత్రి వైద్యురాలిపై ఇప్పటి వరకూ చర్యలు చేపట్టకపోవడానికి రాజకీయ అండదండలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రజా సంఘాల నిరసన, ఎస్పీకి ఫిర్యాదు : ఇప్పటికే పలు ప్రజా సంఘాల ప్రతినిధులు అమలాపురంలోని ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి ఆమెకు అండగా నిలిచారు. బాధ్యులపై పోక్సో కేసులు నమోదు చేయాలని, ఆస్పత్రి వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. బహుజన సమాజ్‌ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పొలమూరి మోహన్‌బాబు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరపతిరావు, సీపీఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు తదితరులు ఇవే డిమాండ్లపై ఆస్పత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారు ఎస్పీ కార్యాలయానికి శుక్రవారం వెళ్లి ఎస్పీ రాహుల్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో బాలికకు అబార్షన్‌ చేసిన ఘటనపై దర్యాప్తు చేయించి బాధ్యులపైన, అడ్డదారిలో వైద్యం చేసిన వైద్యాధికారిణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకూ అమలాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో గాని, నగరం (మామిడికుదురు మండలం) పోలీస్‌ స్టేషన్‌లో గాని బాధ్యులపై కేసులు నమోదు కాలేదని వారు ఎస్పీకి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement