భక్తుల మనోభావాలకు షాక్‌ ఇస్తారా? | - | Sakshi
Sakshi News home page

భక్తుల మనోభావాలకు షాక్‌ ఇస్తారా?

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

ప్రభల తీర్థం స్థలంలో

విద్యుత్‌ టవర్‌ నిర్మాణం తగదు

ప్రజాప్రతినిధులకు, అధికారులకు

మూడు మండలాల ప్రజల వినతి

కొత్తపేట: రెండు నియోజకవర్గాలు, మూడు మండలాల ప్రధాన కూడలి. ఏటా కనుమ పండగ నాడు ప్రభల సభా స్థలి.. వేలాదిగా భక్తులు తరలివచ్చి తిలకించే తీర్థ స్థలి. అదే కొత్తపేట మండలం అవిడి డామ్‌ సెంటర్‌ సమీపాన అంబాజీపేట మండలం చిరతపూడి పంచాయతీ పరిధిలో గల ప్రభల తీర్థ స్థలం. ఆ స్థలంలో హై పవర్‌ లైన్‌ విద్యుత్‌ టవర్‌ నిర్మిస్తారట.. ఇంకెక్కడా స్థలం లేనట్టు ఈ ప్రభల తీర్థ స్థలమే కనిపించిందా? ఇక్కడ టవర్‌ నిర్మిస్తే వందల ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ప్రభల తీర్థం ఎక్కడ నిర్వహించాలి? అని ప్రభల ఉత్సవ కమిటీలు, భక్తులు, వివిధ గ్రామాల ప్రజలు అధికారుల నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ మేరకు కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట మండలం అవిడి, మోడేకుర్రు, రాకుర్తివారిపాలెం, పి.గన్నవరం నియోజక వర్గ పరిధిలోని అంబాజీపేట మండలం చిరుతపూడి, పి.గన్నవరం మండలం నరేంద్రపురం, కుందాలపల్లి, పప్పులవారిపాలెం గ్రామాల ప్రజలు సోమవారం అమలాపురంలో పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించారు.

ప్రసిద్ధి చెందిన ప్రభల తీర్థం..

చిరుతపూడి గ్రామ పరిధిలోని ఒక రైతుకు చెందిన 1.09 ఎకరాల వరి పంట పొలంలో ప్రతి సంవత్సరం. కనుమ పండగ రోజున ప్రభల తీర్థం సుమారు 450 సంవత్సరాల నుంచి జరుగుతోంది. ఈ తీర్థానికి అవిడి, మోడేకుర్రు, రాకుర్తివారిపాలెం, గొల్లకోటివారిపాలెం, చిరుతపూడి, కుందాలపల్లి, పప్పులవారిపాలెం, నరేంద్రపురం గ్రామాల్లోని శివాలయాల ప్రభలను తీసుకొస్తారు. వీటితో పాటు ప్రతి శివారు గ్రామం నుంచి సుమారు ఒక్కొక్కటి 40 నుంచి 60 అడుగుల ఎత్తులో ఉండే సుమారు 25 ప్రభలను ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో భక్తులు తమ భుజాలపై మోసుకొంటూ రోడ్డు, కాలువలు, తోటలు, వరి చేలను దాటుకుంటూ చిరుతపూడి గ్రామం తీర్థ స్థలానికి తీసుకువస్తారు. అక్కడ ఆ రోజు రాత్రి తీర్థం జరుగుతుంది. ఆయా మండలాల నుంచే కాక జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జిల్లాలోని సంక్రాంతి ప్రభల తీర్థాల్లో మకర సంక్రాంతి నాడు జరిగే కొత్తపేట, కనుమ రోజు జరిగే జగ్గన్నతోట, చిరతపూడి ప్రభల తీర్థాలకు చరిత్ర ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement