సుడిగాలి బీభత్సం | - | Sakshi
Sakshi News home page

సుడిగాలి బీభత్సం

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

నేలకొరిగిన వృక్షాలు,

విద్యుత్‌ స్తంభాలు

రామచంద్రపురం రూరల్‌: మండలంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా గాలి వానా మొదలై సుడిగాలి బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. రామచంద్రపురం 132 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి వెళ్లే 33 కేవీ ఫీడర్లపై సుడిగాలి ప్రభావం పడటంతో విద్యుత్‌ శాఖకు అపార నష్టం ఏర్పడింది. ద్రాక్షారామ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని తాళ్లపొలం, ఆదివారపుపేట, జగన్నాయకులపాలెం, ద్రాక్షారామ గ్రామాల్లో 18కి పైగా విద్యుత్‌ స్తంభాలు, 6 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు నేలకొరిగాయని ఏపీఈపీడీసీఎల్‌ రామచంద్రపురం రూరల్‌ ఏఈ మేడిశెట్టి వెంకటరమణ తెలియజేశారు. పలు గ్రామాల్లో 12 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయన్నారు. సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారన్నారు. ద్రాక్షారామ – రామచంద్రపురం ప్రధాన రహదారిపై తాళ్లపొలం తదితర చోట్ల నేలకొరిగిన వృక్షాలు తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్‌ తన సిబ్బందితో తక్షణ చర్యలు చేపట్టారు.

చెట్టు మీద పడి యువకుడికి తీవ్ర గాయాలు

కొత్తపేట: మండల పరిధిలోని పలివెల – కొత్తపాలెం రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది. అదే సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకునిపై చెట్టుకొమ్మలు పడి తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం రాత్రి ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు పలివెల వంతెన దిగువున కొత్తపాలెం వెళ్లే రోడ్డులో భారీ వృక్షం రోడ్డుపై కుప్పకూలింది. అదే సమయంలో కొత్తపాలెం గ్రామానికి చెందిన యయువకుడు కుడుపూడి వెంకటేష్‌బాబు చెట్టుకింద ఇరుక్కుపోయాడు. అతను తీవ్రంగా గాయపడగా, మోటార్‌బైక్‌ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్న వారు చెట్టుకొమ్మలు తొలగించి వెంకటేష్‌బాబును బయటకు తీశారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతనిని అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు స్థానికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement