విద్యార్థినికి అబార్షన్‌పై డీఎంహెచ్‌వో విచారణ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినికి అబార్షన్‌పై డీఎంహెచ్‌వో విచారణ

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

వైద్యానికి, కేస్‌ షీటులో రాసిన

మందులకు పొంతన లేని వైనం

ఘటనపై సమగ్ర నివేదిక కోరిన

కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

అమలాపురం టౌన్‌: స్థానిక నల్ల వంతెన ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇంటర్‌ విద్యార్థినికి అబార్షన్‌ చేసిన ఘటనపై డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.దుర్గారావు దొర, అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ భరతలక్ష్మి ఆ ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థినికి అబార్షన్‌ చేసిన విధానం, కేస్‌ షీటు తదితర అంశాలను వారు పరిశీలించారు. అబార్షన్‌కు వాడిన మందులు, కేస్‌షీటులో పేర్కొన్న మందులకు పొంతన లేదని వారి విచారణలో గుర్తించారు. తాము చేసిన విచారణ విషయాలను కలెక్టర్‌ మహేష్‌కుమార్‌కు వివరించారు. దీంతో ఆర్డీవో జి.మమ్మీ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ దుర్గారావు దొర, ఐసీడీఎస్‌ పీవో కె.నాగమణి తదితర అధికారులతో ఓ కమిటీని కలెక్టర్‌ నియమించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కమిటీని కలెక్టర్‌ ఆదేశించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు రెండు రోజుల్లో అందజేస్తామని డీఎం హెచ్‌వో డాక్టర్‌ దుర్గారావు దొర తెలిపారు.

మూతపడిన ఆస్పత్రి

ఈ ఘటనతో విద్యార్ధినికి అబార్షన్‌ చేసిన ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేయాలని డీఎంహెచ్‌వో ఆస్పత్రి వైద్యురాలు శిరీషను అదేశించారు. ఆస్పత్రిలో అబార్షన్‌ అయి చికిత్స పొందుతున్న విద్యార్థినికి మాత్రమే వైద్యం అందించాలని సూచించారు. కొత్తగా పేషెంట్లను పరీక్షించడం గాని, చేర్చుకోవడం గాని వద్దని ఆదేశించారు. ఈ ఘటనపై నిందితులపై కేసులు నమోదు కాలేదు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు ఉంటాయని తెలిసింది. ఆస్పత్రి వద్ద మోటారు సైకిళ్లు వదిలేసి విద్యార్థిని ప్రియుడు, అతని స్నేహితులు పరారయ్యారు. ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రి నిర్వహణను ప్రభుత్వ వైద్యాధికారిణి పర్యవేక్షిస్తున్న తీరును విచారణ కమిటీ తప్పు పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement