విద్యుత్‌ కోతలపై మహిళల నిరసన | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతలపై మహిళల నిరసన

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ

సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన నాయకులు

కాట్రేనికోన: విద్యుత్‌ శాఖ ఇష్టారాజ్యంగా కోతలు విధించడంతో కాట్రేనికోన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ముట్టడించిన మహిళలకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మండల కేంద్రంతో పాటు శివారు ప్రాంతాల వారు కరెంట్‌ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌ సీపీ నాయకులు మండి పడ్డారు. మండలంలో విద్యుత్‌ లైన్లు 1996 తుపానుకు వేసినవి కావడంతో శివారు ప్రాంతాలలో పాడైపోయాయని, మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నెల రోజుల నుంచి ఓఎన్‌జీసీ (వేదాంత) సంస్థకు చెందిన భారీ వాహనాల రాకపోకల కోసం రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ నల్లా నరసింహమూర్తి, యూత్‌ వింగ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గంటి వెంకట సుధాకర్‌ అన్నారు. కరెంట్‌ లేక మహిళలు, వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాట్రేనికోన, ఉప్పూడి ఫీడర్‌ నుంచి వేట్లపాలెం, సత్తమ్మ చెట్టు, రాజానగరం, కాపులపాలెం, నాగపట్టణం, మర్రిచెట్టు కాలనీ, గచ్చకాయలపోర, చిర్రయానంలకు కరెంట్‌ కోత అధికంగా ఉండటంపై మండి పడ్డారు. సిబ్బంది అలసత్వంపై విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ బి.రాజ రాజేశ్వరికి ఫోన్‌లో వివరించారు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు సంగాని మునేంద్ర, కముజు మల్లికార్జునరావు, రంబాల శ్రీను, నల్లా చిన్నాజీ, గిడ్ల శ్రీనివాసరావు, నీలం బాలయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement